అన్నమయ్య జలాశయంలో పడి యువకుడు మృతి - young man fell into the Annamayya reservoir
సరదా కోసం జలాశయం వద్దకు వెళ్లిన యువకుడు నీటి తాకిడికి కొట్టుకుపోయాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట అన్నమయ్య జలాశయంలో జరిగింది. చేతికందిన కొడుకు మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
కడప జిల్లా రాజంపేటలో అన్నమయ్య జలాశయం నుంచి నీటిని విడుదల చేశారు. రాజంపేట మన్నూరు నుంచి ఖాదర్ భాషా అనే యువకుడు జలాశయం చూడటానికి మిత్రులతో కలిసి వెళ్ళాడు. నీటిలోకి దిగగా...నీటి తాకిడికి కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు రాజంపేటలో పండ్ల వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు. తండ్రి ఆటో డ్రైవర్గా పని చేస్తున్నాడు. చేతికందిన కొడుకు మృతి చెందటంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మన్నూరు ఎస్ఐ షేక్ రోషన్ తెలిపారు.