YCP MLA Rachamallu Violence Against Police:ముఖ్యమంత్రి సొంత జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పోలీసులతో వ్యవహరించిన తీరు ఆ పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులను పరుష పదజాలంతో దూషించడం తీవ్ర విమర్శల పాలైంది. అధిష్ఠానం కలగజేసుకోవడంతో ఎమ్మెల్యే రాచమల్లు పోలీసులకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. మరోవైపు పోలీసులతో అనుచితంగా మాట్లాడిన ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
మరోసారి తెరపైకి అసమ్మతి రాగం - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాచమల్లుకు వ్యతిరేకంగా కౌన్సిలర్ల సమావేశం
వై.ఎస్.ఆర్.జిల్లా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గురువారం జరిగిన ఘటనతో ప్రతిపక్షాలు నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పోలీసులపై ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా మాట్లాడటంతో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తెచ్చి పెట్టింది. మద్యం సీసాలతో పట్టుబడిన పుల్లయ్య అనే వ్యక్తిని ఏకంగా ప్రొద్దుటూరు స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ కార్యాలయం నుంచి ఇంటికి తీసుకెళ్లడమే కాకుండా కార్యాలయంలో విధుల్లో ఉన్న ఎస్ఐ బేగ్‌పై రాచమల్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎస్పీకి కాదు, వాళ్ల బాబుకి చెప్పుకో అంటూ దూషించారు. కేసు పెడితే ఒప్పుకోనన్న ఆయన చట్టాన్ని మార్చుకో, లేకపోతే ప్రభుత్వాన్ని మార్చుకో అంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా బల్లగుద్ది ఎమ్మెల్యే మాట్లాడం అది నేరుగా రాష్ట్ర ప్రభుత్వాన్నే విమర్శించినట్లుగా ఉందని వైసీపీలో చర్చకు దారి దీసింది. ఎమ్మెల్యే తిట్ల పురాణం మీడియాలో ప్రముఖంగా రావడంతో శుక్రవారం తెలుగుదేశంతో సహా విపక్షాలన్ని తప్పు బట్టాయి. రాచమల్లు ప్రసాద్ రెడ్డిపై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయాలని డిమాండు చేశారు.