చంద్రగిరిలో టీడీపీ ఓట్లు గల్లంతు YCP Removing TDP Votes: తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం మద్దతుదారుల ఓట్లు భారీగా గల్లంతయ్యాయి. వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి భారీగా దొంగ ఓట్లు నమోదు చేస్తున్నారని.. నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని ఆరోపించారు. శనివారం పార్టీ నేతలతో కలిసి ఆర్డీఓ కనక నరసారెడ్డిని కలిసి దొంగ ఓట్లపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి తన కార్యాలయంలో దొంగ ఓటర్లను నమోదు చేయిస్తున్నారని.. నాని ఆరోపించారు. తెలుగుదేశం సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగిస్తున్నారని.. బూతులు మార్చి ఓటర్లను అయోమయానికి గురి చేస్తున్నారని మండిపడ్డారు.
పులివర్తివారి పల్లిలో ఉన్న బూతును తీసుకెళ్లి 4కిలోమీటర్ల అవతల ఉన్న వడ్డేపల్లిలో కలిపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డోర్ నెంబర్ లేని ఇళ్లలో భారీగా దొంగ ఓట్లు చేర్చారన్నారు. బూత్ నెం 116లో 1160ఓట్లు ఉంటే తెలుగుదేశం సానుభూతిపరులైన 335మంది ఓట్లు తొలగించారని.. అధికారులకు ఫిర్యాదు చేశారు. అగరాల పంచాయతీలో 832ఓట్లు ఉంటే 312 ఓట్లు.. ఏజీ పల్లెలో బూత్ నెం 122లో 873 ఓట్లు ఉంటే.. 591 తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు.. గల్లంతు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
"చంద్రగిరి నియోజక వర్గంలో డోర్ నంబర్లు లేని ఇళ్లలో వైసీపీ నాయకులు భారీగా దొంగ ఓట్లను చేర్చారు. దీంతోపాటు చంద్రగిరి నియోజకవర్గానికి ఆనుకుని ఉన్న తిరుపతి నియోజకవర్గంలోని ఓట్లను జంబ్లింగ్ చేశారు. అక్కడి ఓట్లను ఇక్కడ.. ఇక్కడ వాటిని అక్కడ మార్చారు. ఇలా తొమ్మిదివేల దొంగ ఓట్లను నమోదు చేశారు. బూత్ నెం 116లో 1160ఓట్లు ఉంటే తెలుగుదేశం సానుభూతి పరులైన 335మంది ఓట్లు తొలగించారు. సాక్ష్యాలతో సహా వీటికి సంబంధించిన వివరాలను నేను ఇప్పుడు ఆర్డీఓకు సమర్పించాను. ఇదేకాక ఎమ్ఆర్ఓ ఆఫీస్లో ఉండాల్సిన కంప్యూటర్ ఆపరేటర్ల లాగిన్లు.. ఎమ్మెల్యే భాస్కర రెడ్డి ఆఫీస్లో లాగిన్ అయి.. దొంగ ఓట్లను నమోదు చేశారు. పులివర్తివారి పల్లిలో ఉన్న బూతును తీసుకెళ్లి 4కిలోమీటర్ల అవతల ఉన్న వడ్డేపల్లిలో కలిపేశారు. తెలుగుదేశం సానుభూతిపరులైన వారి ఓట్లు తొలగిస్తూ.. బూతులు మార్చి ఓటర్లను ఇలా అయోమయానికి గురి చేస్తున్నారు." - పులివర్తి నాని , టీడీపీ నేత
రామిరెడ్డిపల్లిలో వైసీపీ అసమ్మతి నేత కుటుంబ సభ్యుల ఓట్లు గల్లంతయ్యాయి. మొత్తం 18వేల మంది ఓట్లు తొలగిస్తే అందులో 15వేల ఓట్లు టీడీపీ సానుభూతిపరులవే ఉన్నట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. దొంగఓట్లపై ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపిన నేతలు.. చర్యలు తీసుకోకుంటే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు.
ఉరవకొండలో వైసీపీ నాయకులతో కుమ్మక్కు.. టీడీపీ మద్దతుదారుల ఓట్లు తొలగింపు