స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా కడపలో వైకాపా నేతలు బరితెగించారు. నామినేషన్ వేసేందుకు వచ్చిన తెదేపా నాయకులపై దౌర్జన్యం చేశారు. నామపత్రాలు చించివేశారు. పులివెందుల, రాయచోటి, మైదుకూరు, రైల్వేకోడూరు, కడప నియోజకవర్గాల్లో దాడులు చేశారు. చిన్నమండెం మండంలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ పత్రాలను వైకాపా వర్గీయులు చించివేశారు. రెండోసారి నామినేషన్ వేసేందుకు రాగా దాడికి దాగారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి తెలిపారు.
వీరబల్లి మండలం గడికోటలో ఎంపీటీసీ అభ్యర్థిని వైకాపా నేతలు అపహరించారు. రైల్వేకోడూరులో నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారు. తెదేపా నేత చెంగల్రాయుడుకు, వైకాపా నాయకుల మధ్య తోపులాట జరిగింది. చిన్నమండెం మండలం బోనమలలో తెదేపా ఎంపీటీసీ అభ్యర్థి నామినేషన్ వేసినా... అధికారుల బల్లపై నుంచి లాక్కెళ్లారు. వీఎన్పల్లి మండలం ఊరుటూరుకు చెందిన ఎంపీటీసీ అభ్యర్థి పత్రాలను వైకాపా నాయకులు తస్కరించారు. చాపాడు మండలం చియ్యపాడులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామపత్రాలను చించివేశారు.
వేంపల్లె, చక్రాయపేట, వేముల మండలాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు నామినేషన్ వేయకుండా వైకాపా నాయకులు అడ్డుకున్నారు. ఎంపీడీవో కార్యాలయం వద్దనే గుమిగూడిన వైకాపా శ్రేణులు... బెదిరింపులకు పాల్పడ్డారు. పెండ్లిమర్రి మండలం మొయిళ్ల కాల్వకు చెందిన తెదేపా అభ్యర్థిని నామినేషన్ వేయకుండా వైకాపా నాయకులు అపహరించుకుపోయారు. తొండూరు జడ్పీటీసీ అభ్యర్థి నామపత్రాలు లాక్కుని ఆమె భర్తను అపహరించుకుపోయారు. దీన్ని నిరసిస్తూ అరుణమ్మ, తెలుగుదేశం నేతలు జిల్లాపరిషత్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.