ఎన్నికల సమయంలో మెజారిటీ ఓటర్లు ఉన్న సామాజిక వర్గాలకు నేతలు పదవుల ఆశ చూపడం ఇతరత్రా ప్రలోభాలు పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తుంటారు. ఇదే కోవలో కడప జిల్లా రాయచోటిలోని మైనార్టీ సామాజిక వర్గం ప్రతి ఎన్నికల సమయంలోనూ ప్రధాన పార్టీల నుంచి టికెట్లు ఆశించడం తర్వాత హామీలు తీసుకోవడం కొనసాగుతూ వస్తోంది.
తీరిన రాయచోటి చిరకాల వాంఛ
కడప జిల్లా రాయచోటి ప్రజల చిరకాల వాంఛ తీరిందని ప్రజలు ఆనందపడుతున్నారు. ప్రతి నాయకుడు రాయచోటి మైనారిటీలకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతానని అనటం.. ఎన్నికలయ్యాక ఆ మాట మర్చిపోవటం జరిగేదనీ.. జగన్ ఆ మాట నిలబెట్టుకున్నారంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాయచోటి నియోజకవర్గంలో 2.20 లక్షల ఓటర్లు ఉన్నారు. వీరిలో 45 వేల ఓట్లు మైనారిటీ వర్గాలకు చెందినవే ఉన్నాయి. ఈ సామాజిక వర్గం నుంచి 30 ఏళ్ల కిందట హబీబుల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి చవి చూశారు. తర్వాత ఎవరు ప్రధాన పార్టీల నుంచి రంగంలోకి దిగలేదు. దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి హయాం నుంచి మైనారిటీ వర్గాలను దగ్గర చేర్చుకుంటూ వచ్చారు. 2005లో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ ఇక్కడ మైనార్టీలకు సముచిత స్థానం దక్కలేదు. 2019 ఎన్నికల్లో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల ప్రచార సభలో రాయచోటి మైనారిటీలకు ఎమ్మెల్సీ పదవిని కట్టబెడతానని హామీ ఇచ్చారు.
తీరిన చిరకాల వాంఛ..
రాయచోటి మైనారిటీలు తమ ప్రాబల్యం నియోజకవర్గంలో అత్యధికంగా ఉన్నప్పటికీ పదవులు అందుకు తగ్గ విధంగా దక్కడం లేదని నిరాశతో ఉంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇస్తానని చెప్పడంతో ఆశలు పెంచుకున్నారు ఈ పదవి కోసం మైనార్టీ వర్గాల్లోని పలువురు నాయకులు ఆశించినా... వైకాపాలో ఈ వర్గాల నుంచి బలమైన నాయకుడుగా ఉన్న దివంగత నేత అఫ్జల్ అలీ ఖాన్ సతీమణి జకియాకు గవర్నర్ కోటాలో ముఖ్యమంత్రి ఎమ్మెల్సీ పదవిని కట్టబెట్టారు. దాంతో రాయచోటిలో మైనార్టీల చిరకాల వాంఛ తీరినట్లే అయింది.
ఇదీ చదవండి:గవర్నరో కోటా ఎమ్మెల్సీగా రాయచోటికి చెందిన జకియా ఖానం