ఇంతవరకు కరోనాతో నష్టపోయిన చేనేత రంగం ... నేడు భారీ వర్షాలతో ఆర్థికంగా మరింత కుంగిపోయింది. చేనేత రంగంపై ఆధారపడుతున్న వేలాది కడప జిల్లా జమ్మలమడుగు చేనేత కార్మికులు... కరోనా కారణంగా గత 6 నెలలుగా ఉపాధి కోల్పోయారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు మగ్గం గుంతల్లో నీళ్లు చేరి వారి పరిస్థితి మరింత దయనీయంగా మారింది.
కడప జిల్లాలో నూలు వస్త్రం నేసే సంఘాలు 118 ఉండగా.. దానిపై 14, 247 మంది కార్మికులు ఆధారపడి ఉన్నారు. సిల్క్ వస్త్రాన్ని నేసే సంఘాలు 72 ఉండగా, 6239 మంది కార్మికులు ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లా వ్యాప్తంగా 3వేల మగ్గాల్లోకి నీరు చేరినట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో నష్టపోయిన కార్మికులకు బియ్యం ఇచ్చేవారని... ఇప్పుడు అది కూడా లేదని బాధితులు వాపోతున్నారు.