ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జగనన్న కాలనీల్లో నీటి కొరత... పక్కా ఇళ్ల నిర్మాణంపై ప్రభావం - kadapa district updats

కడప జిల్లాలో జగనన్న కాలనీల్లో నీటి కొరత తీవ్రంగా వేధిస్తుంది. నీరు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకురావడం లేదు. పనులను ఏప్రిల్‌ 15 లోపు పూర్తి చేయాలని గుత్తేదారులకు అధికారులు మౌఖికంగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటివరకు పనుల ప్రగతి పరిశీలిస్తే 77 చోట్ల మాత్రమే పూర్తి చేశారు. మరో 159 ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. నేటికీ 55 కాలనీల్లో పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొన్నిచోట్ల చేయడానికి గుత్తేదారులు అసలు ముందుకురావటం లేదు.

Jagananna colonies
జగనన్న కాలనీలు

By

Published : May 2, 2021, 12:01 PM IST

కడప జిల్లా ఒంటిమిట్ట శివారులో సర్వే సంఖ్య 2218లో 2.9 ఎకరాల్లో 90 మందికి, 2219లో 0.90 ఎకరాల్లో 22 మందికి, 2220/2లో 2.25 ఎకరాల్లో 76 మందికి ఇంటి నివేశన స్థలాలు ఇవ్వాలని రెవెన్యూ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. గతేడాది డిసెంబరు 28న లబ్ధిదారులకు పట్టా పత్రాలను అధికారులు అందజేశారు. ఇక్కడ తాగునీటి వసతి కోసం రూ.25 లక్షలు మంజూరు చేశారు. మూడు బోర్లు వేసి మోటార్లను అమర్చాలి. గొట్టాలు వేయాల్సి ఉంది. గృహ నిర్మాణాలకు అవసరమైన నీరు నిల్వ కోసం ట్యాంకులను నిర్మించాల్సి ఉంది. ఇప్పటికీ తాగునీటి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు.

నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయాలని కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ముందుకొచ్చాయి. నివేశన స్థలాలను ఉచితంగా పంపిణీ చేశారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పక్కాగృహాలను మంజూరు చేశారు. నిర్మాణ పనుల కోసం నీటి వసతి కల్పించాలని నిర్ణయించారు. గుత్తపత్రాలను ఆహ్వానించి పనులకు శ్రీకారం చుట్టారు. క్షేత్రస్థాయిలో మాత్రం ఆశించిన స్థాయిలో ఏర్పాట్లు జరగడం లేదు. నీరు అందుబాటులో లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకురావడం లేదు. గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ పర్యవేక్షణలో 291 పనులను చేపట్టాలని అనుమతిచ్చారు. బోర్ల తవ్వించి మోటార్లు, పంపులు, స్టార్టర్లు అమర్చాలి. కరెంటు సరఫరా చేయాలి. పైపులైను వేయాలి. జలాల నిల్వ కోసం తొట్టెలను (చిన్న ట్యాంకులు) నిర్మించేందుకు రూ.29 కోట్లతో అంచనాలు రూపొందించి ప్రతిపాదించారు. ఉన్నతస్థాయిలో ఆమోదం లభించింది. పనులను ఏప్రిల్‌ 15 లోపు పూర్తి చేయాలని గుత్తేదారులకు అధికారులు మౌఖికంగా లక్ష్యాన్ని నిర్దేశించారు. ఇప్పటివరకు పనుల ప్రగతి పరిశీలిస్తే 77 చోట్ల మాత్రమే పూర్తి చేశారు. మరో 159 ప్రాంతాల్లో వివిధ దశల్లో ఉన్నాయి. నేటికీ 55 కాలనీల్లో పనుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. కొన్నిచోట్ల చేయడానికి గుత్తేదారులు అసలు ముందుకురాలేదు. ఒంటిమిట్ట మండలం సాలాబాదు పంచాయతీ మలకాటిపల్లె కాలనీలో రూ.7 లక్షలతో చేయాలని నిర్ణయించారు. ఇక్కడ ఎవరూ గుత్తపత్రాలను సమర్పించలేదు. మరికొన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఇప్పటిదాకా 195 బోర్లు వేశారు. కొన్నింట్లో ఆశించిన స్థాయిలో నీటిమట్టాలు లేవు. 81 చోట్ల మోటార్లను ఏర్పాటు చేశారు. 52 ప్రాంతాల్లో పైపులైను, ట్యాంకుల పనులు 21 గ్రామాల్లో చేపట్టారు. విద్యుత్తు కోసం 157 కాలనీల్లో దరఖాస్తులు చేశారు. మరో 49 చోట్ల సమీపంలోనే కరెంటు అందుబాటులో ఉంది. ఇంకా 85 చోట్ల దరఖాస్తులు చేయాల్సి ఉంది. ఇప్పటికే జరిగిన పనుల కోసం కడప డివిజన్‌లో రూ.47.21 లక్షలు, పులివెందుల డివిజన్‌లో రూ.25.71 లక్షలు, రాజంపేట డివిజన్‌లో రూ.9.57 లక్షలు చెల్లించాలని గృహ నిర్మాణ శాఖకు ప్రతిపాదించారు. ఈ మూడు డివిజన్లలో రూ.29 కోట్లకు గాను రూ.82.49 లక్షలు విలువ చేసే పనులు చేసినట్లు అధికారులు తెలిపారు.

ముందుకురాని లబ్ధిదారులు

జిల్లాలో అన్నమయ్య అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (అడా) కింద 33,061 పక్కాగృహాలను మంజూరు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న నవరత్నాలు పథకంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కోటాలో 2018- 19 సంవత్సరానికి 7,922 మందికి, 2019- 20లో 19,269 మందికి, 2020- 21లో 5,825 మందికి మంజూరు చేశారు. ఈ మేరకు గతేడాది డిసెంబరు 2న ఉత్తర్వు 8 జారీ చేశారు. ఒక్కో గృహానికి కేంద్రం రూ.1.50 లక్షలు, ఉపాధిహామీ నిధులు రూ.30 వేలు వంతున మొత్తం రూ.1.80 లక్షలు మంజూరు చేస్తారు. అందులో గ్రామీణ గడపలో జగనన్న కాలనీల్లో 22,959 మందికి ఇంటి నివేశన స్థలాలను పంపిణీ చేశారు. అందులో తొలివిడతలో 17,489 మందికి పక్కాగృహాలను మంజూరు చేశారు. నీరు లేని కారణంగా ఇల్లు కట్టుకునేందుకు చాలామంది ముందడుగు వేయలేదు. నిన్నటిదాకా మూడం ఉన్న కారణంగా లబ్ధిదారులు పనులు చేపట్టడానికి ముందుకురాలేదు. ఇప్పుడు ఇంటి పనులు ప్రారంభించేందుకు మంచి ముహూర్తం వచ్చింది. ఇకనైనా తాగునీటి పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.

పనుల్లో వేగం పెంచుతాం :

జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోని జగనన్న కాలనీల్లో నీటి వసతి కల్పించేందుకు 291 పనులు చేయాలని రూ.29 కోట్లకు అనుమతిచ్చాం. ఇప్పటికే కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని నిర్మాణంలో ఉన్నాయి. అన్నిచోట్లా తాగునీటి వసతి కల్పిస్తాం. నిర్మాణంలో ఉన్న పనుల్లో మరింత వేగం పెంచుతాం. వీలైనంత త్వరగా పూర్తి చేయిస్తాం. - ఎ.మల్లికార్జునప్ప, బాధ్య ఎస్‌ఈ, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ, కడప

ఇదీ చదవండి

టింబర్ డిపోలో అగ్నిప్రమాదం...భారీగా ఆస్తినష్టం

కొవిడ్ ఆస్పత్రిని పరిశీలించిన కలెక్టర్

ABOUT THE AUTHOR

...view details