ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జలాశయం నుంచి ఊటనీరు.. వణుకుతున్న ఇందుకూరు - సుజలస్రవంతి పథకం

ఎవరైనా గ్రామంలోని జలాశయం నిండితే సంతోషంతో పరవశించిపోతారు. కానీ అక్కడ మాత్రం జలాశయం ఎందుకు నిండుకుండను తలపిస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ వారు అంతలా బయపడేలా చేస్తున్న ఆ జలాశయం గురించి.. ఆ పరిసర గ్రామ ప్రజల ఆవేదన గురించి తెలుసుకోవాలంటే ఈ కథనం చదివేయాల్సిందే.

water leakage from sarvaraya sagar reservoir
సర్వరాయ సాగర్ లీకేజీ

By

Published : Dec 21, 2020, 3:20 PM IST

సర్వరాయ సాగర్ వాటర్ లీకేజీ

అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని.. అన్న చందంగా తయారైంది కడప జిల్లాలోని సర్వరాయసాగర్ జలాశయం పరిస్థితి. జలాశయం నిండుకుండను తలపిస్తున్నా.. ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందించలేదని దయనీయ పరిస్థితి నెలకొంది. ప్రధాన కాల్వలు ఇప్పటివరకు పూర్తికాక పోగా.. ఉన్న జలాశయానికి లీకేజీల బెడద వెంటాడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఎవరైనా డ్యాంలో నీళ్లుంటే సంతోషపడతారు. కానీ ఇందుకూరు గ్రామస్థులు మాత్రం అందకు భిన్నంగా జలాశయంలో ఎందుకు నీళ్లున్నాయా అని కలవరపడుతున్నారు. జలాశయం కట్టకు పది చోట్ల లీకేజీలు ఉండటం దీనికి ప్రధాన కారణం. గ్రామం చుట్టూ ఊటల ద్వారా నీళ్లు చేరడంతో కడప జిల్లాలోని సర్వరాయసాగర్ జలాశయ పరిసర ప్రజలు గగ్గోలు పెడుతున్నారు.

నాసిరకంగా నిర్మాణం పది చోట్ల లీకేజీలు...

గాలేరునగరి-సుజలస్రవంతి పథకంలో భాగంగా కమలాపురం నియోజకవర్గంలోని వీరపునాయునిపల్లె మండలంలో సర్వరాయసాగర్ జలాశయం నిర్మించారు. 3.06 టీఎంసీ సామర్థ్యంతో... సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించే లక్ష్యంతో ఈ జలాశయాన్ని నిర్మించారు. అయితే అధికారులు, గుత్తేదారుల నిర్లక్ష్యం కారణంగా ఇంకా పనులు పూర్తికాలేదు. ప్రస్తుతం పూర్తి చేసిన పనులు కూడా నాసిరకంగా ఉన్నాయని స్థానికులు విమర్శిస్తున్నారు. చాలాచోట్ల రివిట్​మెంట్ కూడా వేయకుండానే వదిలేశారు. ఇప్పుడు ఉన్న రివిట్​మెంట్ కూడా నాసిరకంగా ఉంది. మూడేళ్ల నుంచి జలాశయంలోకి వామికొండ రిజర్వాయర్ నుంచి నీటిని సర్వరాయసాగర్​లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సర్వరాయసాగర్​లో ఒక టీఎంసీ నీళ్లు నిల్వ ఉన్నాయి. కానీ ఈ ఒక టీఎంసీ నీటిని ఒడిసి పట్టుకోవడం ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ నాసిరకంగా నిర్మించిన కట్టకు పదిచోట్ల లీకేజీలు వస్తున్నాయి. దీంతో కట్ట బయట వైపు చూస్తే నీళ్లు ఉబికి బయటికి వస్తున్నాయి. మూడేళ్ల నుంచి ఇదే విధంగా లీకేజీలు ఉన్నాయని గ్రామస్థులు చెబుతున్నారు. లీకేజీల విషయంపై అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని గ్రామస్థులు చెబుతున్నారు. ఎపుడో ఓసారి మరమ్మతులు చేయడం... లీకేజీలకు మట్టి, రాళ్లు వేయడం చేస్తున్నారు. కానీ మరోచోట ఇదే విధంగా లీకేజీలు కొనసాగుతున్నాయి. లీకేజీల కారణంగా ఏ ప్రమాదం పొంచి ఉంటుందోననే ఆందోళన రైతుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో పాటు జలాశయం నిండుకుండను తలపిస్తుండగా... సమీపంలోని పొలాలను ఊటలు ముంచెత్తుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా చీనీ, నిమ్మ తోటలు సాగు చేస్తున్నారు. ఊటల కారణంగా పొలాలన్నీ నీటితో కనిపిస్తున్నాయి. ఫలితంగా నీటిశాతం పంటలకు ఎక్కువై దెబ్బ తింటున్నాయని గ్రామస్థులు వాపోతున్నారు. మూడేళ్ల నుంచి పంటలు దెబ్బతింటున్నా అధికారులు గానీ ప్రజాప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రభుత్వం కనీసం పరిహారం కూడా ఇవ్వడం లేదని వారు తెలుపుతున్నారు. జలాశయం కట్టకు చుట్టూ పెద్దపెద్ద కంపచెట్లు పెరిగిపోయాయి. జలాశయానికి సంబంధించిన కుడి, ఎడమ కాల్వల పనులు కూడా పూర్తి కాలేదు. చాలాచోట్ల పనులు ఆగిపోయాయి. కాల్వలు లేనప్పుడు, ఆయకట్టుకు నీరు అందించలేనప్పుడు ఎందుకు డ్యామ్​లో నీరు నిల్వ చేస్తున్నారని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు.

ఇందుకూరుకు పొంచి ఉన్న నీటిముప్పు

సర్వరాయసాగర్ జలాశయంలో నీరు నిల్వ ఉండటంతో ఎవరికి ఉపయోగం లేకుండా పోతోందనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. డ్యాంకు ఆనుకునే ఇందుకూరు గ్రామం ఉంది. జలాశయం నిర్మాణానికి ఈ గ్రామ రైతులు భూములు ఇచ్చారు. కానీ ప్రస్తుతం 150 ఇళ్లున్న గ్రామంలో వెయ్యిమంది వరకు జనాభా ఉన్నారు. కానీ గ్రామానికి నీటిముప్పు పొంచి ఉంది. ఇప్పటికే గ్రామాన్ని ఊటనీరు చుట్టుముట్టింది. మూడేళ్ల నుంచి ఇదేవిధంగా ఊటనీరు గ్రామానికి పొంచి ఉండటంతో గ్రామస్థులు భయాందోళన చెందుతున్నారు. ఇళ్లలోకి కూడా నీరు చేరి.. పునాదులు మట్టిమిద్దెలు ఎపుడు కూలుతాయోననే భయంతో చాలామంది ఆరుబయటే రాత్రిపూట నిద్రిస్తున్నారు. ఇటీవల కురిసిన తుపాను ప్రభావానికి కొందరు వేరే ఊర్లలో తలదాచుకున్నారు. ఇళ్ల చుట్టూ నీరు పాచిపట్టి ఉంది. విషపురుగులు సైతం ఇళ్లలోకి వస్తున్నాయని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లాపాపలతో భయం.. భయంగా బతుకున్నామంటున్నారు. మట్టికట్టలతో ఉన్న డ్యాంకు లీకేజీలు కొనసాగుతుండటం, గ్రామం చుట్టూ నీటి ఊటల రావడంతో ఎపుడు ఎలాంటి విపత్తు సంభవిస్తుందోనన్న ఆందోళన ఇందుకూరు గ్రామస్థుల్లో వ్యక్తం అవుతోంది.

సీఎంను కలిసేందుకు సిద్ధమౌతున్న గ్రామస్థులు..

ఇప్పటికే పలుమార్లు ఆందోళనలు చేపట్టినా జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంతో... ఈనెలలో జిల్లాకు వస్తున్న ముఖ్యమంత్రి జగన్​ను కలవడానికి గ్రామస్థులు సిద్ధం అవుతున్నారు. సర్వరాయసాగర్ జలాశయాన్ని పర్యవేక్షించాల్సిన జలవనరులశాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. లీకేజీలు వస్తున్నాయని ఫిర్యాదులు రావడంతో ఇపుడు అధ్యయన కమిటీ వేసి పరిశీలించాలనే ఆలోచనలో ఉన్నారు. ఈనెల 24 ముఖ్యమంత్రిని కలవడానికి సన్నద్ధం అవుతున్న ఇందుకూరు గ్రామస్థుల సమస్యకు పరిష్కారం లభిస్తుందో.. లేదో చూడాలి.

ఇదీ చదవండి:'భవిష్యత్తులో కూడా జగన్​ సీఎంగా కొనసాగాలి'

ABOUT THE AUTHOR

...view details