మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును సీబీఐకి అప్పగించాలని కోరుతూ... తాను హైకోర్టును ఆశ్రయించానని ఆదినారాయణరెడ్డి తెలిపారు. తాను వేసిన పిటిషన్‌తో పాటు తెదేపా ఎమ్మెల్సీ బీటెక్ రవి వేసిన పిటిషన్లపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉందని ఆయన కడపలో వెల్లడించారు. తనను వ్యక్తిగతంగా వేధింపులకు గురి చేస్తారనే ఉద్దేశ్యంతో పాటు... కేసు తప్పుదోవ పట్టకూడదనే హైకోర్టులో పిటిషన్ వేశానని ఆయన పేర్కొన్నారు. కేసును పక్కదారి పట్టించేందుకు వైకాపా సర్కార్ ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు.
'వివేకా హత్య కేసును సీబీఐకి అప్పగించండి' - ys vivekananda reddy news
వివేకా హత్య కేసును పక్కదారి పట్టించేందుకు వైకాపా సర్కారు ప్రయత్నిస్తోందని భాజపా నేత, మాజీమంత్రి ఆదినారాయణ రెడ్డి ఆరోపించారు. గతంలో సీబీఐ విచారణ కావాలని జగన్ కోరినట్లు గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు వద్దంటున్నారని ప్రశ్నించారు.
వివేకా హత్య జరిగిన రోజు మార్చి 15న సీబీఐ విచారణ కావాలని జగన్ మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి డిమాండ్ చేసిన విషయం గుర్తుచేశారు. సీబీఐ విచారణ కోరుతూ జగన్ మోహన్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ వేశారన్నారు. వారి కోరిక మేరకే తాము కూడా వివేకా హత్య కేసు ఛేదించేందుకు సీబీఐ విచారణ అడుగుతున్నామని స్పష్టం చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇదే విధమైన డిమాండ్ చేశారని ఆదినారాయణరెడ్డి గుర్తుచేశారు. తన తప్పుంటే దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:'నా పాత్ర ఉందని తేలితే... బహిరంగంగా ఉరివేసుకుంటా'