ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీబీఐకి వివేకా హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం - వివేకా హత్య కేసు

vivekha murder case handover by CBI highcourt verdict
సీబీఐకి వివేకా హత్య కేసు... హైకోర్టు కీలక నిర్ణయం

By

Published : Mar 11, 2020, 2:43 PM IST

Updated : Mar 11, 2020, 4:59 PM IST

14:40 March 11

పులివెందుల పీఎస్‌ నుంచి దర్యాప్తు

వైఎస్‌ వివేకా హత్య కేసు సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.  సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తిచేయాలని సీబీఐని ఆదేశించింది. హత్య జరిగి ఏడాదవుతున్నా దర్యాప్తులో పురోగతి లేదన్న అసంతృప్తితోనే ఈ నిర్ణయం తీసుకుంది. కేసు దర్యాప్తులో ఈ సమయం కీలకం కాబట్టి సీబీఐకి అప్పగిస్తున్నామని తీర్పులో వెల్లడించింది. సీఎం జగన్‌ పిటిషన్‌ ఉపసంహరణ ప్రభావం దర్యాప్తుపై ఉండకూడదని హైకోర్టు పేర్కొంది.

2019 మార్చి 15న వివేకానందరెడ్డి పులివెందులలోని తన ఇంటిలోనే దారుణ హత్యకు గురయ్యారు. హత్యకేసు ఛేదించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మూడు సార్లు సిట్‌ వేసింది. 11 నెలలు గడుస్తున్నా... దర్యాప్తులో ఎలాంటి పురోగతి కనిపించలేదు. ఇప్పటివరకు 1,300 మంది అనుమానితులను సిట్‌ అధికారులు విచారించారు. ముగ్గురు అనుమానితులకు నార్కో అనాలసిస్‌ పరీక్షలు నిర్వహించారు. హత్యా స్థలంలో సాక్ష్యాల తారుమారు అభియోగంతో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఇన్ని చేసినా... అసలు హంతకులు ఎవరనేది ఇంతవరకు తేల్చలేకపోయారు.

ఈ కేసులో తమకు రాష్ట్ర పోలీసులపై నమ్మకం లేదని... సీబీఐకి అప్పగించాలని అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్... అప్పట్లోనే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతుండగానే... ప్రభుత్వం మారింది. అప్పటి ప్రతిపక్ష నేత జగన్... ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ప్రభుత్వం మారి నెలలు గడుస్తున్నా... దర్యాప్తు ముందుకు కదల్లేదు. ఈ జాప్యాన్ని ప్రశ్నిస్తూ... వివేకా భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత... మరోసారి హైకోర్టులో పిటిషన్ వేశారు. అందులో 15 మంది అనుమానితుల పేర్లనూ పొందుపరిచారు. వారితోపాటు తెలుగుదేశం ఎమ్మెల్సీ బీటెక్ రవి, భాజపా నేత ఆదినారాయణరెడ్డి కూడా కేసు సీబీఐకి అప్పగించాలని పిటిషన్ వేశారు. ఈ కేసు విచారణ కొనసాగుతుండగానే... నాడు జగన్ వేసిన పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ప్రభుత్వమే దర్యాప్తు చేపడుతుందని స్పష్టం చేశారు.

వివేకా కుటుంబ సభ్యులు, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వేసిన పిటిషన్ విచారించిన హై కోర్టు... కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. కేసులో అంతర్రాష్ట్ర నిందితులు ఉండే అవకాశం ఉందని న్యాయమూర్తి అన్నారు. ఇతర రాష్ట్రాల నిందితులను పట్టుకునే శక్తి సామర్థ్యాలు సీబీఐకి ఉన్నాయన్నారు. పులివెందుల పీఎస్‌ నుంచి సీబీఐ దర్యాప్తు ప్రారంభించాలని ఆదేశించారు.

ఇదీ చూడండి:

'హైకోర్టు ఆదేశాలు సైతం బేఖాతరు చేస్తున్నారు'

Last Updated : Mar 11, 2020, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details