ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్య వెనుక పెద్ద నాయకుల ప్రమేయం ఉంది: వివేకా బావమరిది - YS Viveka murder case updates

YS Viveka murder case: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరు పెద్ద నాయకుల ప్రమేయం ఉందని …..ఆయన బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి సీబీఐకి తెలిపారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే ‘గుండెపోటు ’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఆ ప్రచారం ప్రారంభించిన వ్యక్తులకు వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందన్నారు. గతేడాది ఆగస్టు 28న ఆయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలం వెలుగులోకి వచ్చింది.

YS Viveka murder case
YS Viveka murder case

By

Published : Mar 5, 2022, 5:12 AM IST

YS Viveka murder case: మాజీ మంత్రి వై.ఎస్‌.వివేకానందరెడ్డి హత్య వెనుక కొందరు పెద్దల ప్రమేయం ఉన్నట్లు... ఆయన బావమరిది, అల్లుడి అన్న నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి సీబీఐ వద్ద అనుమానం వ్యక్తం చేశారు. కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, చిన్నాన్న మనోహర్‌రెడ్డి సమక్షంలోనే ఆధారాల ధ్వంసం జరిగిందని చెప్పారు. దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డిల ఆదేశాల మేరకు అక్కడున్న రక్తాన్ని పనిమనుషులు తుడిచారని వివరించారు. అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డిలకు స్నేహితుడైన ఉదయ్‌కుమార్‌రెడ్డి వివేకా మృతదేహానికి కట్లు కట్టడానికి కాటన్, బ్యాండేజీతో పాటు డాక్టర్లు, కాంపౌండర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. 2019 మార్చి 15వ తేదీ వేకువజామున 4 గంటలకే వివేకా మృతి గురించి ఆయనకు తెలుసన్నారు. ఘటనా స్థలంలోని ఆధారాల్ని ధ్వంసం చేయడానికే ‘గుండెపోటు ’ ప్రచారాన్ని తెరపైకి తెచ్చారన్నారు. ఆ ప్రచారం ప్రారంభించిన వ్యక్తులకు వివేకా హత్య కుట్రలో ప్రమేయం ఉందన్నారు.

వైకాపా స్థాపించడం వివేకాకు ఇష్టం లేదనందునే...

2004 ఎన్నికల్లో కడప ఎంపీ టికెట్‌ కావాలని జగన్‌ పట్టుబట్టారని శివప్రకాశ్ రెడ్డి తెలిపారు. కానీ… ఆ టికెట్‌ వివేకానందరెడ్డికి లభించిందన్నారు. రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రివర్గంలో వివేకా చేరడం జగన్‌కు ఇష్టం లేదని తెలిపారు. 2010లో జగన్‌ వైకాపా స్థాపించడం వివేకాకు ఇష్టం లేదన్నారు. అందుకే ఆ పార్టీలో చేరలేదన్నారు. 2011లో పులివెందుల ఉప ఎన్నికల్లో ఆయన విజయమ్మపై పోటీచేసి ఓడిపోయారని.. వివేకా సోదరుడు సుధీకర్‌రెడ్డితో పాటు వివేకా అనుచరులు ఆయన్ని వైకాపాలో చేరాలని కోరారని తెలిపారు. మొదట్లో వద్దన్నా, తర్వాత జగన్‌ సరేననడంతో 2012 డిసెంబరులో వివేకా వైకాపాలో చేరారని.. కానీ వారిద్దరి మధ్య విభేదాలు ఉండేవన్నారు.

అవినాష్‌రెడ్డికి కడప లోక్‌సభ టికెట్‌ లభించటానికి మూడు కారణాలు..

జగన్‌ సతీమణి వై.ఎస్‌.భారతి తల్లి.. వై.ఎస్‌.భాస్కర్‌రెడ్డికి సోదరి అవుతుంది. పెళ్లి తర్వాత అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి జగన్‌కు దగ్గరయ్యారని తెలిపారు. అవినాష్‌రెడ్డికి కడప లోక్‌సభ టికెట్‌ లభించటానికి మూడు కారణాలున్నాయన్నారు. భారతికి బంధువులు కావటం, 2011 ఉప ఎన్నికల్లో విజయమ్మపై వివేకా పోటీ చేయటం, వివేకాకు అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుకూలంగా లేకపోవటం కారణాలు అని తెలిపారు . వివేకా వైకాపాలో చేరటం, 2017లో ఆయనకు ఎమ్మెల్సీ టికెట్‌ ఇవ్వడంపై భాస్కర్‌రెడ్డి కుటుంబీకులు అసంతృప్తితో ఉండేవారని .. వారు శివశంకర్‌రెడ్డికి మద్దతిచ్చారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వివేకా రాష్ట్రవ్యాప్తంగా వైకాపా తరఫున తిరిగేవారని..... వారి అసంతృప్తికి ఇదీ ఓ కారణం అని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు. తన ఓటమికి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమయ్యారని వివేకా ఆగ్రహంగా ఉండేవారని సీబీఐకి తెలిపారు. ఎర్ర గంగిరెడ్డి వారితో చేతులు కలిపారంటూ అతడినీ దూరం పెట్టారన్నారు.

ఆ విషయం రాజారెడ్డితో చెప్పటం ఆశ్చర్యం..

వివేకానందరెడ్డి చనిపోయారని 2019 మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల18 నిమిషాలకు వివేకా పీఏ ఎంవీ కృష్ణారెడ్డి తనకు ఫోన్‌ చేశారని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కడప ఎంపీ అవినాష్‌రెడ్డికి, వివేకా సోదరుడు రవీంద్రనాథ్‌రెడ్డికి ఉదయం 6 గంటల 26నిమిషాలకు ఫోన్‌ చేసి ఈ విషయం చెప్పానన్నారు. టైపిస్టు ఇనయతుల్లాకు ఫోన్‌ చేసి వివేకా ఇంటికి వెళ్లి చూసి ఏం జరిగిందో చెప్పాలని కోరారన్నారు. తర్వాత తమ కుటుంబమంతా రెండు వాహనాల్లో హైదరాబాద్‌ నుంచి పులివెందులకు బయల్దేరామన్నారు. అవినాష్‌రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లిన తర్వాత తనకు సమాచారం ఇవ్వలేదని తెలిపారు. ఆయనకు ఫోన్‌ చేస్తే తీయలేదన్నారు. అప్పుడు ఎర్ర గంగిరెడ్డికి ఫోన్‌ చేసి వివేకా మరణం గురించి చెప్పానని తెలిపారు. ఆయన చాలా తేలిగ్గా.. ‘అట్లానా’ అనడంతో ఆశ్చర్యం కలిగిందన్నారు. 2019 మార్చి 14న తన మనవరాలి పుట్టినరోజుకు హైదరాబాద్‌ రావాలని ఎర్ర గంగిరెడ్డితో పాటు రాజారెడ్డి అనే మరో వ్యక్తిని 12న ఆహ్వానించానని నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి తెలిపారు. కుటుంబసభ్యులు కాకుండా పులివెందుల నుంచి వారిద్దరినే పిలిచానన్నారు. అత్యవసరమైన పని ఉందని, తాను రాలేనని రాజారెడ్డితో గంగిరెడ్డి చెప్పారన్నారు. ఎంత పని ఉన్నా, కుటుంబంలో ఏ శుభకార్యాలకూ ఆయన హాజరుకాకుండా లేరని తెలిపారు. అలాంటిది రాలేననడం, అదీ తనతో కాకుండా రాజారెడ్డితో చెప్పటం ఆశ్చర్యం కలిగించిందన్నారు. వివేకా హత్యకు గురైన రోజు రాత్రి ఆయన పులివెందుల్లోనే ఉన్నారని సీబీఐకి నర్రెడ్డి శివప్రకాశ్‌రెడ్డి స్టేట్ మెంట్ ఇచ్చారు.

ఇదీ చదవండి:వై.ఎస్. వివేకాను కొట్టి... ఆ లేఖ రాయించారు: సీబీఐ

ABOUT THE AUTHOR

...view details