పులివెందులలోని తమ ఇంటివద్ద ఈ నెల 10వ తేదీన రెక్కీ నిర్వహించారంటూ వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు.. మణికంఠారెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించారు. డీఎస్పీ శ్రీనివాసులు మణికంఠను ప్రశ్నించారు. వివేకా ఇంటి ప్రాంతంలో బైకుపై రెండుసార్లు ఎందుకు తిరగాల్సి వచ్చింది, కాంపౌండ్‌లోకి వెళ్లడానికి కారణమేంటనే అంశాలు ఆరా తీశారు. అద్దె గదుల కోసం వెదుకుతూ అక్కడి వెళ్లినట్లు చెప్పగా.. వివేకా ఇంటి ప్రాంగణంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని డీఎస్పీ ప్రశ్నించారు. దీనిపై మణికంఠరెడ్డి సమాధానంతో సంతృప్తి చెందని పోలీసులు.. బైండోవర్ కేసు నమోదు చేశారు. జమ్మలమడుగు ఆర్డీవో కార్యాలయానికి తీసుకెళ్లి, ఆర్డీవో శ్రీనివాసులు సమక్షంలో బైండోవర్ చేయించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. భద్రత కల్పించాలన్న సునీత విజ్ఞప్తి మేరకు.. వివేకా ఇంటి వద్ద పోలీసులు పికెట్ ఏర్పాటు చేశారు.
వివేకా ఇంటి వద్ద రెక్కీ చేయలేదని మణికంఠరెడ్డి చెబుతున్నాడు. పులివెందుల ప్రాంతంలో జరిగే సీఎం సభలు, వైకాపా కార్యక్రమాలు సహా పెళ్లిళ్లు, ఇతర ఈవెంట్లు చేస్తుంటానని.. అందులో భాగంగానే వివేకా ఇంటి పరిసరాలకు వెళ్లానని అంటున్నాడు. అంతకుమించి తనకు ఇంకేమీ తెలియదంటున్నాడు.