ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వివేకా హత్యకేసులో వైకాపా, తెదేపా నేతలను ప్రశ్నించిన సిట్​

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వై.ఎస్ వివేకానంద హత్య కేసు విచారణలో సిట్ వేగం పెంచింది. వైకాపా, తెదేపాల్లో అనుమానితులను అధికారులు కడపకు పిలిచి విచారించారు. ఈ విచారణ మరో 10 రోజుల పాటు ఉంటుందని కడప ఎస్పీ అన్బు రాజన్ తెలిపారు.

వివేకా హత్యకేసులో వైకాపా, తెదేపా నేతలను ప్రశ్నించిన సిట్​
వివేకా హత్యకేసులో వైకాపా, తెదేపా నేతలను ప్రశ్నించిన సిట్​

By

Published : Dec 3, 2019, 5:03 AM IST

మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యకేసును దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం విచారణ ముమ్మరం చేసింది. దాదాపు 8 నెలలు అవుతున్నా హంతకులు ఎవరనేది కనిపెట్టలేక పోవడాన్ని పోలీసుల వైఫల్యంగా విపక్షాలు విమర్శలు చేస్తున్న తరుణంలో... ఈకేసులో మళ్లీ కదలిక తెచ్చే విధంగా పులివెందుల నియోజకవర్గంలోని వైకాపా, తెదేపాకు చెందిన నలుగురు ముఖ్య నాయకులకు కడపకు తీసుకొచ్చి రహస్య ప్రాంతంలో సిట్ విచారించింది. దాదాపు మూడు నెలల నుంచి విచారణ మందగించగా.. సోమవారం మళ్లీ ప్రారంభమైంది. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.ఎస్.అవినాశ్ రెడ్డి తండ్రి వై.ఎస్.భాస్కర్ రెడ్డి, చిన్నాన్న మనోహర్ రెడ్డిని సిట్ అధికారులు విచారణకు పిలిచారు.

కడప శివారులోని పోలీసు శిక్షణ కేంద్రంలో వీరిద్దరినీ విచారించారు. వివేకాతో ఏమైనా ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల గొడవులు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో విచారించినట్లు తెలిసింది. సాయంత్రం నుంచి రాత్రి వరకు మరో ఇద్దరు తెదేపా నాయకులను కడపకు పిలిచి విచారించారు. వీరిలో సింహాద్రిపురం మండలానికి చెందిన తెదేపా నాయకుడు కొమ్మా శివరాఘవరెడ్డితో పాటు మరో కీలక అనుమానితుడిని పోలీసులు విచారించారు. ఆగస్టు 1న ఆత్మహత్య చేసుకున్న శ్రీనివాస్ రెడ్డికి కొమ్మా శివరాఘవరెడ్డి సమీప బంధువు కావడం విశేషం. శ్రీనివాస్ రెడ్డి ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు.... వివేకా హత్యతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు వీరిని విచారించినట్లు తెలుస్తోంది. నిన్న మధ్యాహ్నం నుంచి రాత్రి పొద్దు పోయే వరకు రహస్య ప్రదేశంలో విచారించారు. ఇకనుంచి మరో పది రోజుల వరకు వివేకా హత్య కేసులో అనుమానితుల విచారణ కొనసాగుతోందని జిల్లా ఎస్పీ అన్బురాజన్ తెలిపారు. మరికొందరు కీలక అనుమానితులను కడపలో విచారించే అవకాశం ఉన్నట్లు పోలీసు వర్గాల సమాచారం.

వివేకా హత్యకేసులో వైకాపా, తెదేపా నేతలను ప్రశ్నించిన సిట్​

ఇవీ చదవండి
నెలలు గడుస్తున్నా వీడని వివేకానందరెడ్డి హత్య మిస్టరీ

ABOUT THE AUTHOR

...view details