ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పంటనష్టం నమోదు తీరుపై గ్రామస్థుల నిరసన - నివర్ పంట నష్టం వివరాలు సరిగా నమోదు చేయలేదంటూ చిన్న చెప్పలి గ్రామస్థుల ఆందోళన

నివర్ తుపాను వల్ల జరిగిన పంట నష్టం నమోదులో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని.. రైతులు నిరసన వ్యక్తం చేశారు. కడప జిల్లా కమలాపురం మండలం చిన్న చెప్పలి సచివాలయం వద్ద ధర్నాకు దిగారు. చిన్న శనగకు బదులు మినుములుగా.. ఈ-క్రాప్​లో నమోదు చేశారని మండిపడ్డారు. లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవని ఆవేదన వ్యక్తం చేశారు.

villagers protest
ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

By

Published : Dec 20, 2020, 7:18 AM IST

ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

కడప జిల్లా కమలాపురం మండలం చిన్న చెప్పలి సచివాలయం వద్ద గ్రామస్థులు ఆందోళన చేపట్టారు. నివర్ తుఫాన్ వల్ల దాదాపు 400 ఎకరాల్లోని పంట నష్టాన్ని.. సరిగా నమోదు చేయలేదంటూ నిరసనకు దిగారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఇలా జరిగిందని ఆరోపించారు. ఈ-క్రాప్ బుకింగ్ చేసి.. వాటిని అంతర్జాలంలో నమోదు చేయకపోవడం ఏమిటని ప్రశ్నించారు.

చిన్న శనగను మినుములుగా నమోదు:

ఆయా రైతుల పంట పొలాల్లో చేపట్టాల్సిన ఈ-క్రాప్ నమోదును.. అన్నదాతలను ఒకే చోటికి పిలిపించి చేశారని గ్రామస్థులు పేర్కొన్నారు. దాదాపు 90 శాతం రైతులు చిన్న శనగ పంట వేయగా.. సగానికిపైగా మినుములుగా నమోదు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటను గోదాముల్లో పెట్టుకోవడానికి ఇబ్బందిగా ఉంటుందని చెప్పినా అధికారులు వినిపించుకోలేదని తెలిపారు. వారు అంతర్జాలంలో నమోదు చేయని కారణంగా జాబితాలో తమ పేర్లు లేవని ఆరోపించారు.

స్పందన కరవైంది..

400 ఎకరాల పంట వివరాలకు సంబంధించి.. ఒకే గ్రామానికి చెందిన దాదాపు 85 మంది పేర్లు నమోదు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులను ప్రశ్నిస్తే.. లబ్ధిదారుల జాబితా మీ దగ్గరకు ఎలా వచ్చిందంటూ ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ఏవోని కలవడానికి వెళ్లగా అందుబాటులో లేరని.. చరవాణిలో మాట్లాడడానికి ప్రయత్నించినా స్పందించడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం కల్పించుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

అధికారులు ఏమంటున్నారు?:

ఈ విషయంపై వ్యవసాయాధికారిని వివరణ కోరగా.. జేడీ కార్యాలయంలో సమావేశంలో ఉండటం వల్ల.. రైతుల ఫోన్​కు స్పందించలేక పోయానని తెలిపారు. రైతుల వద్ద ఉన్న జాబితా సరైనది కాదని.. దానిని వారికి ఎవరిచ్చారో తెలియదని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:

తెదేపా చలో పులివెందుల... అడ్డుకున్న పోలీసులు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details