వివేకా హత్య వెనక తెదేపా: విజయసాయి - విజయసాయిరెడ్డి
జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైకాపా నేత విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనక తెదేపా హస్తం ఉందని ఆరోపించారు.
జగన్ చిన్నాన్న, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యపై వైకాపా నేత విజయసాయిరెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ హత్య వెనక ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, మంత్రి ఆదినారాయణరెడ్డి హస్తం ఉందని ఆరోపించారు. నిత్యం ప్రజాసేవలో ఉండే వివేకాతో తన మనుగడకు ముప్పు అని భావించే.. ఆదినారాయణరెడ్డి హత్యకు ఒడిగట్టారని అన్నారు. రాష్ట్రంలోని చాలా మంది రాజకీయ నాయకుల హత్యల్లో తెదేపా ప్రమేయం ఉందని విజయసాయి అన్నారు. వివేకా హత్యపై విచారణ నిమిత్తం... ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందంపై తమకు నమ్మకం లేదన్నారు. సిట్‌తో నామమాత్రంగా విచారణ జరిపిస్తారేమోనని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు వైకాపా వాళ్లే ఈ హత్య చేశారని చెప్తారేమోనన్నారు. వైఎస్ కుటుంబాన్ని లేకుండా చేయాలని తెదేపా కుట్ర చేసిందన్న విజయసాయి... హత్యోదంతంపై నిష్పాక్షిక విచారణ జరగాలన్నారు. కేసును ప్రభుత్వం సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. వైకాపా అధినేత జగన్.. వివేకాకు నివాళి అర్పించారని చెప్పారు. రేపు అంత్యక్రియల అనంతరం హైదరాబాద్‌కు జగన్ వెళ్తారన్నారు.