YS Viveka murder Case: వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యలో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డి, డి.శివశంకర్‌రెడ్డిల ప్రమేయం ఉందని కడప, పులివెందుల నియోజకవర్గాల్లోని చాలామందికి తెలుసు. కానీ వారి అధికారబలాన్ని చూసి భయంతో ఎవరూ నోరు విప్పట్లేదు. వారు ముగ్గురూ దేన్నయినా మేనేజ్ చేయగల, తమకు అనుకూలంగా మార్చుకోగల శక్తిమంతులు’ అని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో పులివెందులకు చెందిన ఆర్.వెంకటరమణ పేర్కొన్నారు. ఎంపీ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డితో పాటు, సీఎం జగన్‌కూ శివశంకర్‌రెడ్డి సన్నిహితుడని తెలిపారు. గతేడాది డిసెంబరు 1న ఆయన సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో చెప్పిన ముఖ్యాంశాలు ఇవీ..
వాళ్లిద్దరికీ ఇతర నేరాల్లోనూ భాగస్వామ్యం
నేను విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి శివశంకర్‌రెడ్డి తెలుసు. గంగాధర్‌రెడ్డి కూడా చాన్నాళ్లుగా తెలుసు. అనేక నేరాల్లో శివశంకర్‌రెడ్డికి, గంగాధర్‌రెడ్డికి భాగస్వామ్యం ఉంది. నా భద్రతా కారణాల దృష్ట్యా వాటిని బయటపెట్టలేను. వివేకానందరెడ్డి మంచి నాయకుడు. వైకాపాలో చేరినప్పటి నుంచి ఆయనకు పెరుగుతున్న ఆదరణ చూసి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి ఆయనంటే శత్రుత్వం పెంచుకున్నారు. శివశంకర్‌రెడ్డి చాలా ప్రాబల్యం ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రి జగన్‌తో, భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డితో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా అధికారం చెలాయించేవారు. - ఆర్.వెంకటరమణ
సీబీఐకి ఏం చెప్పావని అడిగారు
నేను గతంలో కడపలో సీబీఐ అధికారులను కలిసిన విషయాన్ని శివశంకర్‌రెడ్డి తెలుసుకున్నారు. ఒకరోజు నన్ను పిలిచి సీబీఐ ఆఫీసుకి ఎందుకెళ్లావని అడిగారు. నేరం జరిగిన ప్రదేశంలో ఉన్నాను కాబట్టి.. నన్ను పిలిచి వాంగ్మూలం తీసుకున్నారని బదులిచ్చాను. సీబీఐకి ఏం చెప్పావని అడిగారు. హత్య జరిగిన ప్రదేశంలో ఏం చూశానో అదే చెప్పానన్నాను. ‘హత్య జరిగిన ప్రదేశంలో నేను ఉన్నట్టుగా చెప్పావా?’ అని అడిగారు. ఆధారాల ధ్వంసం గురించి సీబీఐ అధికారులతో చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని, విడిచిపెట్టే ప్రసక్తే లేదని ఆయన నన్ను హెచ్చరించారు.- ఆర్.వెంకటరమణ