దాదాపు నెలరోజులుగా వివాదానికి కేంద్ర బిందువుగా మారిన కడప జిల్లా బ్రహ్మంగారిమఠం(Brahmamgari Matam) పీఠాధిపత్యం సమస్య కొలిక్కి వచ్చింది. దివంగత పీఠాధిపతి వెంకటేశ్వర స్వామి మొదటి భార్య పెద్ద కుమారుడు వెంకటాద్రిస్వామికే పీఠం దక్కేలా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదిరింది. ఈ మేరకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆజాద్, మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి.. ఉదయం నుంచి మఠంలో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. రెండు కుటుంబాల వారితో వేర్వేరుగా చర్చలు జరిపారు. అందరూ ఒకే అభిప్రాయంతో ఉండాలని హితవు పలికారు. దివంగత పీఠాధిపతి మొదటి భార్య కుమారుడు వెంకటాద్రిస్వామి 12వ పీఠాధిపతిగా త్వరలోనే నియమితులవుతారని ప్రత్యేక అధికారి ఆజాద్ తెలిపారు.
ఉత్తరాధి పీఠాధిపతిగా రెండవ కుమారుడు భద్రయ్యస్వామి, ఆయన తదనంతరం మారుతీ మహాలక్ష్మీ కుమారుడు గోవిందస్వామి పీఠాధిపతి అయ్యే విధంగా కుటుంబ సభ్యులు రాతపూర్వక హామీ ఇచ్చారు. త్వరలోనే పీఠాధిపతి ప్రమాణ స్వీకారం వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే రఘురారెడ్డి తెలిపారు.