నివర్ తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు కడప జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నిండుకుండను తలపిస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గంలో ఉన్న వెలిగల్లు ప్రాజెక్ట్ దాదాపు పూర్తిగా నిండింది. 4.65 టీఎంసీల నీటి సామర్ధ్యం ఉన్న ఈ జలాశయం ఇప్పటివరకు పూర్తిగా నిండలేదు. ఆదివారానికి 4.46 టీఎంసీలకు చేరుకుంది.
2 రోజుల కిందట ప్రాజెక్టు నుంచి 5 గేట్ల ద్వారా 3000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. నేడు ఒక గేటు ఎత్తి వెయ్యి క్యూసెక్కులను పాపాగ్ని నదిలోకి వదిలారు. 12 ఏళ్ల తర్వాత ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జలాశయం కుడి, ఎడమ కాలువల నుంచి 24 వేల ఎకరాల ఆయకట్టుకు సాగు నీరు అందనుంది. నియోజకవర్గంలోని గాలివీడు, లక్కిరెడ్డిపల్లి, రామాపురం మండలాలకు సాగునీటితో పాటు.. తాగునీరు అందిస్తామని అధికారులు తెలిపారు.