ఖనిజాన్ని తవ్వేసి... కాలకూట విషాన్ని మిగిల్చారు అణువిద్యుత్ కర్మాగారాలను నడిపేందుకు యురేనియం అవసరం. దేశంలోని సగానికి పైగా యురేనియం నిక్షేపాలు కడప జిల్లాలోని ఎం. తుమ్మలపల్లెలోనే ఉన్నాయి. వీటిని వెలికితీసేందుకు కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర సంస్థ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ ఖనిజ తవ్వకాన్ని, ప్రాసెసింగ్ ప్లాంట్ను ఏర్పాటుచేసింది. యురేనియం ఉత్పత్తి సమయంలో అనేక హానికరమైన రసాయనాలు వెలువడతాయి. ఇవి కొంత బురద రూపంలో మరికొంత నీటి రూపంలో ఉత్పత్తి అవుతాయి. పర్యావరణ శాఖ నిబంధనల ప్రకారం ఈ వ్యర్థాలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేసే చెరువుకు భూగర్భ జలం కలుషితం కాని రీతిలో లైనింగ్ చేయాలి. చెరువు నిండే క్రమంలో నీటిని సేకరించి కర్మాగారంలో వ్యవసాయానికి పనికి వచ్చే ప్రమాణాలతో శుద్ధి ప్రక్రియ జరగాలి. అప్పుడు వెలువడే బురదను మళ్లీ చెరువులోకే పంపాలి.
నిబంధనలు గాలికొదిలేసి
యురేనియం గని తవ్వకానికి, కర్మాగారానికి అనుమతి ఇచ్చే సమయంలో రాష్ట్ర పర్యావరణ మండలి ఒక స్పష్టమైన నిబంధన విధించింది. వ్యర్థాలను నింపేందుకు ఏర్పాటు చేసే చెరువు అంతటా బెన్‌టోనైట్ అనే ఖరీదైన మట్టితో 500 మిల్లీమీటర్ల మందంతో పొర ఏర్పాటు చేయాలి. తర్వాత 250 మైక్రాన్ ఉండే పాలీ ఇథిలీన్ పొరను అనంతరం 250 మిల్లీ మీటర్లతో ఇసుకతో కానీ మట్టితో కానీ మరో పొరను అదనపు రక్షణగా ఏర్పాటు చేయాలి.
ఎన్నో లేఖలకు ఇప్పుడు స్పందన
నిబంధనలు ఇంత స్పష్టంగా ఉన్నా యురేనియం సంస్థ 250 మైక్రాన్ ఉండే పాలీ ఇథిలీన్ పొరను ఏర్పాటు చేయలేదు. ఇతర జాగ్రత్తలూ తీసుకోలేదు. ఫలితంగా కర్మాగారం చుట్టుపక్కల గ్రామాల పరిధిలోని బోర్లలోని నీరు పాడై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ బాధలను వివరిస్తూ కాలుష్య నియంత్రణ మండలికి లేఖలు రాశారు. స్థానిక ఎంపీ అవినాశ్ రెడ్డి, ఈ సమస్యపై పోరాడుతున్న పర్యావరణ వేత్త కె.బాబురావు విజ్ఞాపనలు పంపారు. వీటిని పరిగణనలోకి తీసుకున్న మండలి ఆ గ్రామాల పరిధిలోని బోర్ల నుంచి నీటిని సేకరించి పరీక్షలు చేయిస్తే భూగర్భ జలాల్లో అధిక క్షారత్వం, యురేనియం గాఢత ఉన్నాయని తేలింది.
పరీక్షల్లో నమ్మలేని నిజాలు
కాలుష్య నియంత్రణ మండలి చేయించిన పరీక్షల్లో విస్తుగొలిపే వాస్తవాలు వెలుగు చూశాయి. బోర్లనీటిలో అధిక క్షారత్వం, టోటల్ హార్డ్ నెస్, మెగ్నీషియం, సల్ఫేట్లు, సోడియం, కాన్సట్రేషన్ ఆఫ్ ఇసి, నీటిలో కరిగే ఘన వ్యర్థాలతో పాటు కాపర్, క్రోమియం, నికెల్ వంటి అధిక భార లోహాలు ఆమోదనీయ పరిమాణం కంటే అధికంగా ఉన్నట్టు తేలింది. అణుశక్తి నియంత్రణ మండలి ప్రమాణాల ప్రకారం తాగునీటిలో యురేనియం గాఢత 60 పీపీబీ దాటకూడదు. కానీ ఇక్కడి బోర్లలో 690 నుంచి 4000 పీపీబీ వరకూ ఉంది.
నీరు తాగితే నపుంసకత్వం
యురేనియం తవ్వకాలు, కర్మాగారం కారణంగా నీరు కలుషితమై మనుషులకే కాదు.. జంతువులూ తాగేందుకు పనికిరాకుండా పోతోంది. ఈ నీరు తాగితే మనుషుల కిడ్నీలు పాడవుతాయి. నపుంసకత్వం వస్తుంది. చర్మవ్యాధులూ వస్తాయి. నీటిలో అధిక క్షారత్వం కారణంగా భూమి సాగుకు పనికిరాకుండాపోతుంది. అధిక క్రోమియం కారణంగా మొక్కలు పోషకాలను తీసుకోవడంలో ఇబ్బందిపడతాయి.
కేంద్ర సంస్థకు తీవ్ర హెచ్చరిక
వ్యర్థాల చెరువుకు రాష్ట్ర పర్యావరణ మండలి నిర్దేశించిన మేరకు 250 మైక్రాన్ ఉండే పాలీ ఇథిలీన్ పొరను యురేనియం సంస్థ ఏర్పాటు చేయలేదు. ఈ విషయంపై రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి 2018 మార్చిలో షోకాజ్ నోటీసు జారీ చేసింది. యురేనియం సంస్థ బదులిస్తూ.. తాము అణుశక్తి మండలి మార్గదర్శకాల ప్రకారం తగిన మట్టితో అవసరమైన మందంతో వ్యర్థాల చెరువుకు లైనింగ్ ఏర్పాటు చేశామని తెలిపింది. వీటిపై సంతృప్తి చెందని మండలి పాలీ ఇథిలీన్ పొరను ఏర్పాటు చేసి ఉండాల్సిందని గట్టిగా అభిప్రాయపడింది. తదుపరి చర్యగా గతేడాది నవంబర్ 19న పరిశ్రమకు అదనపు మార్గదర్శకాలు జారీ చేసింది. భూగర్భంలోకి కాలుష్యం వెల్లని రీతిలో వ్యర్థాల చెరువును బాగు చేసేందుకు కాలవ్యవధితో కూడిన కార్యాచరణ ప్రణాళిక సమర్పించాలని కోరింది. ఇందుకోసం మరో చెరువును ఏర్పాటు చేసి ప్రస్తుత చెరువు నుంచి వ్యర్థాన్ని అందులోకి మార్చాలని పేర్కొంది. ఇవేమీ జరగనందున రాష్ట్రపర్యావరణ మండలి తీవ్రమైన హెచ్చరికతో ఈనెల 7న షోకాజ్ నోటీసు ఇచ్చింది. వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే.. పరిశ్రమ మూసివేత వంటి చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.