వారికి గొర్రెల పెంపకమే జీవనాధారం. తమ వృత్తిలో భాగంగా గొర్రెలను మేతకు తీసుకెళ్లిన ఇద్దరిని విద్యుత్తు తీగల రూపంలో మృత్యువు కబళించింది. వీరితో పాటు గొర్రెలు, తోడుగా వెళ్లిన శునకం మృత్యువాత పడ్డాయి. ఓ రైతు తన పొలాన్ని పందుల నుంచి కాపాడుకునేందుకు అమర్చిన విద్యుత్తు తీగలతో జరిగిన ఈ ప్రమాదం ప్రొద్దుటూరు మండలం రేగుళ్లపల్లి సమీపంలో శనివారం చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, వారి స్వగ్రామంలో విషాదం అలముకుంది.
న్యూస్‌టుడే, ప్రొద్దుటూరు నేరవార్తలు ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లెకు చెందిన బైరగాని దస్తగిరి (42), బత్తల రామక్షుమ్మ (35) శనివారం గ్రామానికి చెందిన మరి కొందరితో కలిసి గొర్రెలు మేపేందుకు వెళ్లారు. ఈ క్రమంలో గొర్రెలు రేగుళ్లపల్లి సమీపంలోని ఏటిగట్టున పొలంలోకి వెళ్తుండగా వాటిని నిలువరించేందుకు వారిద్దరూ వెళ్లారు. పొలానికి అమర్చిన విద్యుత్తు తీగలను వారు గమనించకపోవడంతో విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతిచెందారు. వీరితో పాటు 8 గొర్రెలు, కాపలాకు తీసుకెళ్లిన శునకం కూడా మృత్యువాత పడ్డాయి. ఆ ఇద్దరూ ఎంతసేపటికీ రాకపోవడంతో ఆదే గ్రామానికి చెందిన మరో మహిళ వెళ్లి చూడగా పొలంలో వారు విగతజీవులుగా పడి ఉండడాన్ని గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వెంటనే కుటుంబసభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. సమాచారమందుకున్న గ్రామీణ ఎస్.ఐ.అరుణ్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుల కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్.ఐ. తెలిపారు. దస్తగిరికి భార్య మళ్లీశ్వరి, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉండగా, రామలక్షుమ్మకు భర్త నాగయ్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.