Illegal Diesel Transport In Kadapa : వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసు అధికారులు సస్పెండ్‌కు గురయ్యారు. బయోడీజిల్‌తో పాటు కర్ణాటక నుంచి అక్రమంగా దిగుమతి అవుతున్న డీజిల్‌పై చర్యలు తీసుకోని కారణంగా.. సస్పెండ్ చేసినట్లు జిల్లా ఎస్పీ అన్బురాజన్ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా సీఐ మధుసూదన్ గౌడ్, ఏఎస్ఐ అహ్మద్ బాషాను వీఆర్‌కు పంపిస్తున్నట్లు వివరించారు.
ప్రొద్దుటూరు గ్రామీణ ఠాణా పరిధిలో బయోడీజిల్, కర్ణాటక డీజిల్ దిగుమతి వ్యవహారంలో ఆరోపణలు ఉన్నాయి. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. ఈ చర్యలలో భాగంగా ఇద్దర్ని సస్పెండ్ చేయగా.. మరో అధికారిపై కూడా వేటు పడే అవకాశం ఉందనీ పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రొద్దుటూరుకు చెందిన కొందరు పొరుగు రాష్ట్రాల నుంచి బయోడీజిల్, డీజిల్ అక్రమంగా దిగుమతి చేసుకుని పెద్ద ఎత్తున విక్రయాలు జరుపుతున్నారు. కర్ణాటక రాష్ట్రంలో లీటరుపై 10 రూపాయలు తక్కువ ఉండటంతో ట్యాంకుల కొద్ది అక్రమంగా దిగుమతి చేసుకుని ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.