కడప, నెల్లూరు జిల్లాల్లోని ఏటీఎం కేంద్రాల్లో డబ్బు నిల్వ చేసే సిబ్బందే రూ.60.92 లక్షలను దోచేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న కడప జిల్లాలోని బద్వేలు పోలీసులు నెల్లూరు రోడ్డులోని పాలిటెక్నిక్ కళాశాల వద్ద నిందితులను అరెస్ట్ చేశారు. వీరి నుంచి రూ. 10 లక్షల నగదు, రూ. 7లక్షలు విలువ చేసే షేర్ మార్కెట్ బాండ్లతో పాటు ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
వైటర్స్ బిజినెస్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో పని చేస్తున్న బద్వేల్ శాస్త్రి నగర్, తిరు వెంగళపురం గ్రామానికి చెందిన ఎల్లాల జబీర్, సయ్యద్ అహ్మద్, వంకరాజు చిన్న వెంకటసుబ్బయ్య ఏటీఎం కేంద్రాల్లోని యంత్రాల్లో డబ్బు నిల్వచేసే వారు. కరోనా కాలంలో రూ. 60.92 లక్షలు దుర్వినియోగం చేసినట్లుగా ఆడిట్‌లో బయటపడటంతో కంపెనీ బ్రాంచ్ మేనేజర్ మురళీకృష్ణ ఈనెల 20న బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 25లక్షలు దుర్వినియోగం చేసిన వెంకటసుబ్బయ్య మోసం బయటపడుతుందనే భయంతో ఈనెల 15న బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. జలీల్, సయ్యద్ అహ్మద్‌లను ఆదివారం అరెస్ట్ చేశారు.