Two people committed suicide and died: తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటున్న బాలికను తల్లిదండ్రులు మందలించగా మనస్థాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం లక్ష్మీపురం గ్రామంలో చోటుచేసుకుంది. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఉరి వేసుకోవడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. లక్ష్మీపురానికి చెందిన బత్తల సిరి 9వ తరగతి చదువుతోంది. ఆదివారం సెలవు దినం కావడంతో సాయంత్రం తోటి పిల్లలతో కలిసి ఆటలాడుకుంటోంది. బాలిక ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఇంకా ఎంతసేపు ఆడుకుంటావని, ఇంటికి రావాలని మందలించారు. దీంతో మనస్థాపానికి గురైన ఆ బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కళ్ల ఎదుట ఆటాడుకుంటూ కనిపించిన బాలిక కొన్ని నిమిషాల వ్యవధిలోనే శవమే కనిపించడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ అరుణ్ రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక ఎస్సై తెలిపారు.
ప్రకాశం జిల్లాలో.. అర్ధవీడు మండలం కాకర్ల గ్రామ సమీపంలో ప్రేమ్ కుమార్ (18) అనే యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామ శివార్లలోని నిర్మానుష ప్రదేశంలోని ఓ రేకుల షెడ్డులో ఉరివేసుకొని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. యువకుడు దొనకొండ మండలం పుల్లయ్యా పల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ప్రేమ్‌కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డ కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.