కడప జిల్లా, పులివెందుల నియోజకవర్గం వేముల మండలంలోని తుమ్మలపల్లి యురేనియం ప్రాజెక్టును 2007 లో అప్పటి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. దేశానికి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో ప్రారంభించిన ఈ ప్రాజెక్టు సమయంలో ఇచ్చిన హామీలను.. ఇప్పటికీ నెరవేర్చలేదని స్థానిక ప్రజలు అన్నారు.
హామీలు ఏమిటి?
భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు, యురేనియం ప్రాజెక్టు నుంచి వచ్చే టైలింగ్ పాండు విషయం, చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధి.. ఇలా దేన్నీ నెరవేర్చకుండా గాలికొదిలేశారని ఆవేదని వ్యక్తం చేస్తున్నారు.
ఏ ధైర్యంతో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారు?
ముఖ్యంగా చెట్ల పెంపకం కీలకమైన విషయం. కాలుష్యాన్ని నివారించడానికి ప్రధానమైనది. కానీ ఈ పరిసర ప్రాంతాల్లో చెట్ల పెంపకాన్ని గాలికి వదిలి, ఎడారిలా మార్చారని అన్నారు. ఇప్పుడు ఏ ధైర్యంతో వచ్చి రెండో ప్లాంట్ను ప్రారంభించడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేస్తారని వాపోయారు.
జగన్ ఏమని చెప్పారు.. అధికారులు ఎలా వ్యవహరిస్తున్నారు?
ప్రాజెక్ట్ చుట్టుపక్క గ్రామ ప్రజలకు ఏ ఒక్కరికి.. అన్యాయం జరిగినా సహించేది లేదని ఆరు నెలల క్రితం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. సీఎండీ కి చెప్పారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఈ విషయంలో వారికి నచ్చిన విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఏమైనా అడిగితే నాలుగేళ్లలో నాలుగు వాటర్ ప్లాంట్లు అంటారే తప్ప.. అభివృద్ధి పై దృష్టి సారించలేదని అన్నారు. హామీల పై శ్రద్ధ పెట్టుంటే, పూర్తి సహకారం అందించేవాళ్లమని పేర్కొన్నారు. గత మూడు, నాలుగేళ్లలో కేసులను సైతం లెక్కచేయకుండా ఎన్నో ఉద్యమాలను చేపట్టినప్పటికీ.. వారిలో ఎటువంటి చలనం లేదని వాపోయారు. అదేవిధంగా యూసీఐఎల్ అధికారులు మా బాధలను మానవత్వంతో ఆలోచించి హామీలను నెరవేర్చాలని కోరారు.
ఆందోళనను మరింత ఉద్ధృతం చేసేందుకు వెనుకాడం..
ఇక్కడ జరుగుతున్న అన్యాయాలను గాలికొదిలి, రెండో ప్లాంటు నిర్మాణానం కోసం జనవరి ఆరో తేదీన ప్రజాభిప్రాయ సేకరణకు అధికారులు వస్తున్నారని అన్నారు. మా నిరసన పట్ల ఇప్పటికీ ఎటువంటి స్పందన లేకుంటే, చుట్టుపక్క గ్రామాల సాయంతో కదిలి ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి ఏ మాత్రం వెనుకాడమని గ్రామస్థులు పేర్కొన్నారు.
ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకోవడానికి ఏ మాత్రం వెనుకాడం