మీడియాతో మాట్లాడుతున్న పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి మద్యనిషేధం విషయంలో ప్రభుత్వం వైఖరి.. చిత్తం శివుడి మీద... భక్తి చెప్పుల మీద అన్నట్లుందని పీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. మద్యం అమ్మకాలపై జేఎస్టీ(జగన్ సర్వీస్ టాక్స్) వేస్తున్నారని ఆరోపించారు. కడప జిల్లా వేంపల్లెలో తులసి రెడ్డి మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన తర్వాత 3 దశల్లో మద్యం నిషేధిస్తామని చెప్పిన వైకాపా.. ఇప్పుడు ఎక్సైజ్ ఆదాయాన్ని పెంచుకుంటుందని ఆరోపించారు. వైకాపా దొంగ నీతికి ఎక్సైజ్ ఆదాయం వృద్ధే నిదర్శనమని తులసిరెడ్డి పేర్కొన్నారు. మద్యం నిషేధం అమలు చేస్తే.. ఎక్సైజ్ ఆదాయం తగ్గాలి కాని... 2019- 20 బడ్జెట్లో రూ.2297 కోట్లు అదనంగా చూపడం ఏమిటని ప్రశ్నించారు. మోదీ జీఎస్టీ.. జగన్ జేఎస్టీ
మద్యం ధరలు పెంచితే తాగడం తగ్గుతుందని ప్రభుత్వం చెప్పడం ఆత్మవంచన అవుతుందని ధ్వజమెత్తారు. మోదీ ప్రభుత్వం జీఎస్టీ పెంచి వినియోగదారుల నడ్డి విరిస్తే... వైకాపా జేఎస్టీ (జగన్ సర్వీస్ టాక్స్) వేసి సామాన్యుణ్ని దోచుకుంటుందన్నారు. అదనపు జేఎస్టీ చెల్లిస్తే... కావాల్సినంత మద్యం లభిస్తుందన్నారు. పర్మిట్ గదులు రద్దు చేయడం వలన తాగుబోతులు ఎక్కడ పడితే అక్కడ తాగుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో మద్యం నిషేధాన్ని సరిగ్గా అమలుచేయాలని సూచించారు.