అప్పులు చేయటం, ప్రభుత్వ ఆస్తులు అమ్మటంలో ప్రధాని మోదీ, సీఎం జగన్ ప్రభుత్వాలు పోటీ పడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ధ్వజమెత్తారు. మోదీ దేశాన్ని అప్పుల కుప్ప చేయగా.. జగన్ సైతం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని విమర్శించారు. జగన్ ప్రభుత్వం ఏటా రూ. లక్ష కోట్ల అప్పు చేస్తోందని ఆక్షేపించారు. పన్నుల భారం మోపడం, ధరలు పెంచడం జగన్ పాలనలో నిత్యకృత్యమైందన్నారు.
1947 నుంచి 2014 వరకు 13 మంది ప్రధాన మంత్రుల పాలనలో కేంద్రం చేసిన అప్పు రూ. 46లక్షల కోట్లు అయితే.. 2014 నుంచి 2021 వరకు 7 సంవత్సరాల కాలంలో మోదీ చేసిన అప్పు రూ.74 లక్షల కోట్ల అని మండిపడ్డారు. పాడి ఆవులాంటి ఎల్‌ఐసీలో 20 శాతం వాటా అమ్మాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించడం శోచనీయమన్నారు.