మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురై ఏడాది గడిచింది. గత ఏడాది 2019 మార్చి 15న వైఎస్ వివేకానందరెడ్డి.. పులివెందులలోని ఆయన నివాసంలో హత్య కాబడ్డారు. నిందితులు ఎవరనేది పోలీసులు తేల్చలేని పరిస్థితుల్లో.. హైకోర్టు సీబీఐకి కేసును అప్పగించింది. నేడు ఆయన వర్థంతి సందర్భంగా.. భార్య సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్ రెడ్డి సమక్షంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు.
ఉదయం వివేకా ఇంటి సమీపంలో ఏర్పాటు చేసిన వివేకా కాంస్య విగ్రహానికి కుటుంబ సభ్యులు పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అనంతరం పులివెందుల సీఎస్ఐ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. అక్కడ వివేకా వర్ధంతి సభను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రథమ వర్ధంతి కావడంతో అభిమానులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. ముఖ్యులకు ఆహ్వాన పత్రాలూ పంపారు. సీఎం జగన్ కుటుంబసభ్యులు హాజరయ్యే అవకాశం ఉంది.