తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కడప వాసులకు చేరువైంది. లాక్డౌన్ కారణంగా తిరుమలకు వెళ్లలేని భక్తులకు... కనీసం స్వామివారి ప్రసాదం అందించాలనే ఉద్దేశ్యంతో... తితిదే శ్రీవారి ప్రసాదాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. ఆయా జిల్లాల్లో తిరుమల శ్రీవారి లడ్డూలను పంపిణీ చేస్తున్నారు.
కడప జిల్లాలోని తితిదే కల్యాణ మండపంలో... తిరుమల లడ్డూ ప్రసాదాలను పంపిణీ చేస్తున్నారు. జిల్లాకు 20 వేల లడ్డూలు సరఫరా చేశారు. ఒక్కో లడ్డూ ధర రూ.25తో విక్రయిస్తున్నారు. లడ్డూ ప్రసాదం కోసం భక్తులు ఉదయం నుంచే బారులు తీరారు. కరోనా కారణంగా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి... భౌతిక దూరం పాటించాలని నిర్వాహకులు సూచిస్తున్నారు. ఎలాంటి నిబంధనలు లేకుండా కోరినన్ని లడ్డూలు విక్రయిస్తుండటం విశేషం.