ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కలకలం.. రెండు రోజుల్లో ముగ్గురు చిన్నారులు మృతి - undefined

Problems in hospitals: రెండు రోజుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందడంతో కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో కలకలం రేగింది. వైద్యుల పర్యవేక్షణ లేక వైద్యం సకాలంలో అందకపోవడంతో ముగ్గురు పిల్లలు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపించారు. లక్ష రూపాయల విలువ చేసే పరికరాలు ఉన్నప్పటికీ పిల్లలు మృతి చెందడంతో ఈ ఘటన జిల్లావ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ ముగ్గురు పిల్లల మృతిపై అధికారులు విచారణ చేపట్టారు.

1
1

By

Published : Apr 10, 2022, 8:24 AM IST

Updated : Apr 10, 2022, 9:05 AM IST

children died in kadapa hospital: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని నవజాత శిశు విభాగంలో రెండు రోజుల్లో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. వీరిలో ఒకరు శుక్రవారం మృతిచెందగా, శనివారం ఇద్దరు తుదిశ్వాస విడిచారు. వైద్యుల పర్యవేక్షణ సరిగా లేక, వైద్యసేవలు సక్రమంగా అందకపోవడమే ఇందుకు కారణమని శిశువుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అప్పటికే పిల్లల ఆరోగ్యం విషమంగా ఉందని, వివిధ ఆసుపత్రులు తిరిగి ఇక్కడికి వచ్చారని, కాపాడడానికి మా వంతు ప్రయత్నం చేశామని వైద్యులు చెబుతున్నారు. వైద్యుల నిర్లక్ష్యమే తమ పిల్లల మృతికి కారణమని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఆసుపత్రి వద్ద శనివారం ఆందోళన చేశారు. ‘ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో వసతులు బాగుంటాయి.. అనుభవం ఉన్న వైద్యులు ఉంటారు.. మెరుగైన వైద్య సేవలు అందిస్తారని వస్తే గర్భశోకం మిగిల్చారు’ అని చిన్నారుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆక్సిజన్‌ అందించి ఉంటే మా బాబు ప్రాణాలు నిలిచేవి..: మా బాబుకు 5 నెలలు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులుండడంతో ఆసుపత్రికి తీసుకొచ్చాం. బాబును పరిశీలించిన వైద్యులు రక్తంలో ఇన్‌ఫెక్షన్‌ ఉందన్నారు. రెండు రోజుల్లో పూర్తిగా నయమతుందని చెప్పారు. ఉన్నట్టుండి ఐసీయూ నుంచి నవజాత శిశు విభాగానికి తెచ్చారు. ఆరోగ్య పరిస్థితి క్షీణించిందని, ప్రాణాపాయం ఉండవచ్చునని చెప్పారు. నవజాత శిశు విభాగంలో ఒకే మానిటర్‌ పనిచేస్తోంది. అప్పటికే అక్కడ ఒకరు ఉన్నారు. మా బాబుకు ఆక్సిజన్‌ అందించే సరికి ఆలస్యమైంది. మరో యంత్రం ఉండి ఆక్సిజన్‌ అందించి ఉంటే మా బాబు ప్రాణాలు నిలిచేవి. ఈ విభాగంలో వైద్యులు ఉండడం లేదు. వైద్య విద్యార్థులే పురిటి బిడ్డలకు వైద్యం చేస్తున్నారు. తెలిసీ తెలియని వైద్యం, ఒకే యంత్రం ఉండడంతోనే చిన్నారులు మృత్యువాత పడుతున్నారు.- రాజు, చంద్రిక, గురజాల, సింహాద్రిపురం మండలం

జబ్బులతోనే మృతి చెందారు:ఆసుపత్రిలో ముగ్గురు శిశువులు చనిపోయింది వాస్తవమేనని కడప ఆర్డీవో ధర్మచంద్రారెడ్డి అన్నారు. కడపలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వివిధ జబ్బులతోనే ముగ్గురు శిశువులు మృతిచెందినట్లు చెప్పారు. షబానా అనే మహిళకు శిశువు పుట్టిన వెంటనే చనిపోయారని, కడప భాకరాపేటకు చెందిన యోగేశ్వర్‌కుమార్‌రెడ్డి కుమారుడు మెదడుకు సంబంధించి జబ్బుతో మృతి చెందాడని, వారు పలు ఆసుపత్రుల చుట్టూ తిరిగి ఆసుపత్రికి వచ్చారన్నారు. సింహాద్రిపురం మండలం గురజాలకు చెందిన రాజు, చంద్రికల బిడ్డకు న్యూమోనియా రావడంతో చనిపోయారని, తల్లిదండ్రులకు చిన్నారుల ఆరోగ్య పరిస్థితి తెలుసునన్నారు. ఆసుపత్రిలో 15 వెంటిలేటర్లు, 5 మానిటర్లు ఉన్నాయని, వీటి నుంచి బీపీ చెక్‌ చేసుకునే అవకాశం ఉందని వైద్యులు చెప్పారన్నారు. ఈ ముగ్గురు చిన్నారుల మరణంలో వైద్యుల నిర్లక్ష్యం లేదని, వైద్యపరికరాల కొరత లేనేలేదన్నారు.

ఆసుపత్రి వద్ద తెదేపా నాయకుల నిరసన:ఆసుపత్రిలో శిశువుల మరణాలు తల్లులకు కడుపు కోత మిగిల్చిందని తెదేపా కడప పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షుడు లింగారెడ్డి అన్నారు. సరైన చికిత్స అందక ముగ్గురు శిశువులు మరణించినట్లు తెలిసి శనివారం రాత్రి తెదేపా నాయకులు ఆసుపత్రికి చేరుకోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఆసుపత్రి ఐపీ విభాగం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చిన్నారులు మృతిచెందినట్లు తెలిసి పరిశీలించడానికి వస్తే పోలీసులు అడ్డుపడడం సరికాదన్నారు. నిరసనలో తెదేపా నాయకులు అమీర్‌బాబు, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంతోనే ముగ్గురు చిన్నారులు ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారని తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. కారణాలు అడుగుతున్న తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా ఇంటికి పంపించేశారని ఆరోపించారు. ఆసుపత్రి, అధికారుల తప్పిదాలను గోప్యంగా ఉంచారన్నారు.

ఇదీ చదవండి:Electricity: విద్యుత్తు లేదా.. కొనడానికి డబ్బుల్లేవా?

Last Updated : Apr 10, 2022, 9:05 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details