ప్రభుత్వాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ యంత్రాలు, పరికరాలు పని చేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. ప్రైవేటు కేంద్రాల్లో పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తుండటంతో రోగులు ఆర్థికంగా నష్టపోతున్నారు. పలు ఆసుపత్రుల్లో యంత్రాలు పని చేస్తున్నా.. సాంకేతిక నిపుణులు, రోగులను చూడాల్సిన వైద్యులు లేనందున వాటివల్ల ఉపయోగం కనిపించడం లేదు. నిర్వహణ కోసం తగిన నిధులు లేకపోవడం, పర్యవేక్షణ లోపంవల్ల యంత్రాలు మొరాయించడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరమ్మతుల కోసం సాంకేతిక నిపుణులను పిలుస్తున్నా.. చెల్లింపుల్లో జాప్యం కారణంగా వారి నుంచి సహకారం లభించడం లేదని ఆసుపత్రుల వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. అన్ని రకాల ఆసుపత్రుల్లో కలిపి వేల సంఖ్యలోనే యంత్రాలు, ఆపరేషన్ థియేటర్లలోని పరికరాలు పనిచేయని పరిస్థితుల్లో ఉన్నాయని తెలిసింది.
*తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానమైన రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రిలో రెండేళ్ల నుంచి సి.టి.స్కానర్ పని చేయడంలేదు.
*గుంటూరు జిల్లా తెనాలి జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని సి.టి.స్కానర్ పరిస్థితి అంతే.
*పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రభుత్వాసుపత్రిలో రెండు స్కానింగ్ పరికరాలున్నాయి. వీటిలో ఒకటి అధునాతనమైనది. రేడియాలజిస్టులు లేనందున ఇవి రెండు ఉపయోగించే పరిస్థితులు కనిపించడం లేదు.
*కడప జిల్లా రాజంపేటలోని ఆసుపత్రిలో చాలాకాలంగా పెద్ద ఎక్స్‌రే యంత్రం పనిచేయడం లేదు. దీంతో మొబైల్ యంత్రంతో సరిపెడుతున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలో అల్ట్రాసౌండ్ స్కానింగ్ యంత్రం మూలకు చేరింది. సిబ్బంది కొరతతో వినియోగించడం లేదు. ఇక్కడున్న రేడియాలజిస్టు సెలవుపై వెళ్లి తిరిగిరాలేదు. 8 నెలలు దాటినా మరొకరిని నియమించలేదు. ముఖ్యంగా గర్భిణులకు తీవ్ర ఇబ్బందిగా మారింది.