Theft Incidents in Andhra Pradesh: రాష్ట్రంలో దొంగతనాలు పెరిగిపోతున్నాయి. ఎప్పుడు, ఎక్కడ దొంగలు రెచ్చిపోతున్నారో అర్థం కావడం లేదు. చోరీలకు పాల్పడేందుకు ముందుగానే రెక్కీలు నిర్వహించి.. ఎవరికీ అనుమానం రాకుండా దొంగతనాలకు పాల్పడుతున్నారు. అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే.. దాడులకు తెగబడుతున్నారు. ఈ వరుస దొంగతనాల వల్ల రాష్ట్రంలోని ప్రజలు హడలెత్తిపోతున్నారు.
అనంతపురం జిల్లాలో వరుస చోరీలు : అనంతపురం జిల్లాలోని గుంతకల్లు పట్టణంలో మూడు రోజుల్లో జరిగిన 3 దొంగతనాల వల్ల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో 3రోజుల్లోనే.. రెండు ఇళ్లలో, మూడు దుకాణాల్లో దొంగలు చోరీలకు పాల్పడ్డారు (Theft in Guntakal). మొదట కసాపురం రోడ్డులోని ఓ ఇంట్లో దాదాపు 55 తులాల బంగారు ఆభరణాలు, రెండున్నర కిలోల వెండి ఎత్తుకెళ్లారు.
ఆ ఘటన మరవక ముందే.. రెండు రోజుల తర్వాత దొంగలు మరోసారి రెచ్చిపోయారు. పట్టణంలోని మెయిన్ రోడ్డులో గల 3దుకాణాల్లో చోరీలకు పాల్పడ్డారు. తాళాలు పగలగొట్టి అందులోని నగదు ఎత్తుకెళ్లారు. 5 వేల రూపాయల నగదు, గ్యాస్ సిలిండర్ ఎత్తుకెళ్లారని ఓ దుకాణ యాజమాని తెలిపారు. చోరీకి పాల్పడిన ఘటన దుకాణాల వద్ద ఉన్న సీసీ కెమెరాలో రికార్డైంది. కసాపురం పోలీస్ స్టేషన్లో సిబ్బంది కొరత ఉందని సమాచారం. దీంతో పట్టణంలోనూ.. గ్రామీణ ప్రాంతంలో గస్తీ నిర్వహించాలంటే పోలీసులు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది.
నగల వ్యాపారి ఇంట్లో చోరీ.. ఛేదించిన పోలీసులు.. 9కిలోల బంగారం స్వాధీనం
కడప జిల్లాలో పట్టపగలే :కడప జిల్లాలో దొంగలు పట్టపగలే రెచ్చిపోతున్నారు. జిల్లాలోని వేంపల్లి పట్టణ పరిధిలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 14తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. స్థానిక చైతన్య హైస్కూల్ వీధి సమీపంలో.. సింగారెడ్డి అమర్నాథ్ రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే అమర్నాథ్ ఇంట్లో లేని సమయంలో ఆయన తల్లి నాగసుబ్బమ్మ ఒంటరిగా ఉండటాన్ని గమనించిన దొంగలు.. చోరీకి యత్నించారు. ఈ క్రమంలో ఆమె దొంగలను అడ్డుకునేందుకు ప్రయత్నించినట్లు అమర్నాథ్ వివరించారు. దుండగులు నాగసుబ్బమ్మపై దాడి చేసి.. బాత్రూంలో పడేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం ఆమె మెడలోని గొలుసు, చేతి గాజులు ఎత్తుకెళ్లారని ఆయన అన్నారు.
Theft in Vempalli Kadapa District: ఈ ఘటనపై వేంపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు అమర్నాథ్ రెడ్డి తెలిపారు. ఫిర్యాదు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలానికి చేరుకుని వివరాలను సేకరిస్తున్నారు. పట్టపగలే చోరీ జరగడంతో.. స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
100 ఇళ్లల్లో దొంగతనం- 20సార్లు జైలుకు, గోవాలో మరోసారి 'ఎస్కేప్ కార్తీక్' అరెస్ట్
Theft in Pendurthi విశాఖలో చోరీ:విశాఖ జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. దొంగతనానికి పాల్పడి.. ఆధారాలు లభ్యం కాకుండా ఉండేందుకు వాటిని చెరిపేసేందుకు ప్రయత్నించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెందుర్తిలోని చిన్న మూసివాడ ఉడా కాలనీలో ఓ ఇంట్లో ప్రవేశించిన దొంగలు చోరికి పాల్పడ్డారు. ఆ సమయంలో ఇంట్లో, ఇంటి చుట్టూ పరిసర ప్రాంతాల్లో కారం వెదజల్లారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మీ ఫోన్ పోయిందా..? బెంగ వద్దు హాయ్ అని మెసేజ్ పెట్టండి గ్యారెంటీగా దొరుకుతుంది...!