Khadaf vali : అన్నం తినొద్దు, పాలు తాగొద్దు, చక్కెర ముట్టొద్దు... ఖాదర్‌వలీ ఇవన్నీ చెబుతుంటే ఇప్పుడైతే లక్షలాదిమంది కళ్ళప్పగించి చూస్తున్నారు కానీ, పాతికేళ్లకిందట పరిస్థితి వేరు! అప్పట్లో ఆయన మాటలు విన్నవాళ్ళు పిచ్చోడికింద జమకట్టారు. కుహనావైద్యుడేమోనని సందేహించారు. ఇన్ని ఉన్నా, తాను నమ్మినదాని కోసం దేన్నైనా ఎదుర్కోవడానికి సిద్ధపడ్డారు ఖాదర్‌వలీ. ఆర్థిక సౌఖ్యాలు వదులుకుని అడుగుముందుకేశారు. ఆ అడుగులే నేడు ఆయన్ను ‘పద్మశ్రీ’ దాకా చేర్చాయి. ఆ స్ఫూర్తి ప్రయాణంలోని కొన్ని మైలురాళ్ళు...
అప్పుడు నాకు ఇరవైరెండేళ్ళుంటాయి. భారత్‌లో పీహెచ్డీ ముగించి పోస్ట్ డాక్టరేట్ కోసం అమెరికాలోని ఆరెగాన్ రాష్ట్రంలో అడుగుపెట్టాను. వెళ్ళిన తొలిరోజే ‘ఫిట్నెస్ సర్టిఫికెట్’ తెచ్చుకోమన్నారు. స్థానిక ఆసుపత్రికి వెళ్ళి... డాక్టర్ కోసం వెయిట్‌చేస్తూ కూర్చున్నాను. నా పక్కనే ఓ ఆరేళ్ల అమెరికన్ పాప ఉంది. ఆ పాపతో మాటలు కలపాలని ప్రయత్నించాను కానీ... నేను ఎంత పలకరించినా తను మారుమాట్లాడలా. పెద్ద తప్పేదో చేసినట్టు దిగాలుగా తలవంచుకుని ఉంది. తల ఎత్తితే ఆకాశం వంక చూస్తోంది కానీ... నన్ను పట్టించుకోవడంలా. ఇంతలో వాళ్ళమ్మ డాక్టర్ దగ్గర్నుంచి విచారంగా బయటకి వస్తే ‘ఈ పాప ఎందుకిలా ఉంది?’ అని అడిగాను. ‘నీకెందుకు..?’ అందామె విసురుగా. ‘తన వయసుకి ఈ దిగులు మరీ ఎక్కువగా అనిపిస్తేనూ అడిగాను... క్షమించండి!’ అన్నాను. ఆమె నన్ను తేరిపార చూసి ‘ఏమీ లేదు... తను పదిరోజులకిందట రజస్వల అయింది. ఆరేళ్లకే కావడం అటుంచితే... రక్తస్రావం ఆగట్లేదు!’ అంది. దిగ్భ్రాంతికి గురయ్యాను. అప్పట్లో మనదేశంలో పద్నాలుగేళ్ళకికానీ అమ్మాయిలు రజస్వల అయ్యేవారు కాదు... ఇక్కడ ఆరేళ్లకే... ఎందుకిలా?! డాక్టర్ దగ్గరకి వెళ్ళి అడిగితే ‘ఇక్కడ 8-9 ఏళ్ళకే అమ్మాయిలు రజస్వల కావడం పెరుగుతోంది. ఈ పాప కేసు కొంత అరుదైనది... అంతే’ అన్నాడు సింపుల్‌గా. ఆయన దగ్గర సర్టిఫికెట్ తీసుకుని కాలేజీలో చేరిపోయానుకానీ... నాకు మూణ్ణాలుగు రోజులపాటు నిద్రపట్టలేదు. ఆ పాపే గుర్తురాసాగింది. వాళ్ళమ్మ నాకు ఆ విషయం చెప్పగానే తన కళ్లలో మెదిలిన నీళ్లూ, తనలో తాను ముడుచుకుపోయిన తీరూ... నన్ను కలవరపెట్టాయి. ఆ విషయంపైన అప్పట్లో నేను స్వతంత్రంగా చేసిన పరిశోధనలే... నా జీవితాన్ని మార్చేశాయి, ఇక్కడి దాకా తీసుకొచ్చాయి. ఆ వివరాల్లోకి వెళ్ళేముందు...
బుద్ధదేవుని భూమిలో :ఒక్క పద్యం.. జీవితాలని మార్చేస్తుందా? నన్ను మార్చిందనే చెప్పాలి. ‘బుద్ధదేవుని భూమిలో పుట్టినావు, సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి? అందమును హత్యచేసెడి హంతకుండ, మైలపడిపోయెనోయి నీ మనుజజన్మ’ అన్న వాక్యం అది. కరుణశ్రీగారి ‘పుష్పవిలాపం’లోని ఆ పదాలు నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఆ కవి పూలకోసమే అంతగా విలవిల్లాడిపోతే... మనుషుల్నే నమ్ముకుని ఉన్న పశుపక్ష్యాదులకి మనం చేస్తున్నదేమిటీ అన్న ఆలోచన నన్ను నిలవనీయలేదు. వైఎస్సార్ జిల్లాలోని ప్రొద్దుటూరు మాది. నాన్న హుసేన్ సాహెబ్ టైలరే కానీ... కనీస ఆదాయం కూడా ఉండేది కాదు. పూరి గుడిసెలో నివాసం. ఇంట్లో ఇద్దరక్కయ్యలూ ఓ అన్నయ్యా తర్వాత నేను. మా గుడిసెలో అందరూ ఇంటి లోపల నిద్రపోయే పరిస్థితి లేదు. మగవాళ్ళం బయటే పడుకునేవాళ్ళం. నేను చిన్నప్పటి నుంచీ మా మేక, కుక్క, కోళ్ళ మధ్యే నిద్రపోయేవాణ్ణి. వాటిని నా అన్నదమ్ములూ అక్కచెల్లెళ్ళలాగే చూసేవాణ్ణి! అలా చూసుకుంటున్న మేకనో కోడినో మాంసం కోసం నరుకుతుంటే... వద్దంటూ శోకాలు పెట్టి ఏడ్చేవాణ్ణి. నాకు పదకొండేళ్ళప్పుడు అనుకుంటా... మా లైబ్రరీలో ‘పుష్పవిలాపం’ దొరికింది. ఆ పుస్తకం నా జీవకారుణ్యంలో తప్పేమీలేదన్న ధైర్యాన్నీ తెచ్చింది. ఆ రోజుతో... నేను ఇక మాంసం ముట్టనని తెగేసి చెప్పాను. మా ఇంట నన్ను తిట్టనివాళ్ళు లేరు ఆ రోజు. పోనుపోను బంధువులందరూ ముస్లిం ఇంట చెడబుట్టినవాడిగానే నన్ను చూడసాగారు. వాళ్ళ మధ్య అమ్మే నన్ను కాస్త అర్థం చేసుకుంది. ఇంట్లో మాంసం వండినప్పుడల్లా ‘నీ కోసం ఇంకో కూర ఏం చేయనురా!’ అని సణుగుతూనే పప్పూ చారూ చేస్తుండేది. ఐదో తరగతి నుంచే పుస్తకాలు చదివే అలవాటు ఉండటం వల్ల చదువులోనూ రాణించసాగాను. అప్పుడే మా అన్నయ్యకి రైల్వేలో ఉద్యోగం వచ్చింది. రేణిగుంటలో పోస్టింగు. ఇంట్లో నా ‘శాకాహారదీక్ష’ని భరించలేక కొంతా... అన్నయ్యతో ఉంటే నా చదువుకి ఢోకా ఉండదన్న ఆలోచనతో కొంతా... అమ్మానాన్నలు నన్ను ఆయనతో పంపించేశారు. అలా అన్నయ్యతో ఉంటూ తిరుపతిలో పదో తరగతి, గుంతకల్లులో ఇంటర్ పూర్తి చేశాను. మైసూరులోని రీజనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ నుంచి బ్యాచిలర్ ఆప్ సైన్స్ ఎడ్యుకేషన్, మాస్టర్స్ చేశాను. రెండింట్లోనూ యూనివర్సిటీ స్థాయిలో ఫస్టొచ్చాను. నన్ను మా ప్రొఫెసర్లు బెంగళూరులోని ప్రతిష్ఠాత్మక ఐఐఎస్సీలో పీహెచ్‌డీకి అప్లయి చేయమన్నారు. డిగ్రీలో నేను చదివింది పేరుకి బీఎస్సీయే కానీ... అందులో పెద్దగా సైన్సులేదు. ఆ బేసిక్స్ లేకపోయినా... రెండునెలలపాటు శ్రమించి ఐఐఎస్సీలో సీటు తెచ్చుకున్నాను. అప్పటికే నేను గాంధీ స్వీయచరిత్రని చదివి ఉన్నాను. ఆయన విద్యార్థి దశలో చేసినట్టే... శాకాహారం గురించీ అహింస గురించీ ప్రచారం చేయసాగాను. కనిపించినవాళ్ళందరికీ లెక్చర్లిస్తుండటంతో... స్నేహితులందరూ నన్ను చూసి పారిపోసాగారు.. ఒక్కరు తప్ప!
హోమియోపతితో ప్రయోగాలు.. :ఆ ఒక్కరు ఉష. తనూ వర్సిటీలో పీహెచ్డీ చేస్తుండేది. మా స్నేహం ప్రేమగా మారి పెళ్ళి చేసుకోవాలని అనుకున్నాక... మతాలని కారణంగా చూపి ఇద్దరి పెద్దలూ మమ్మల్ని వెలివేసేశారు! మేమూ ఇరుమతాలనీ మరచి రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం. అప్పట్లోనే నాకు హోమియోపతితో పరిచయం ఏర్పడింది. ఓ సైంటిస్టుగా మొదట్లో దాన్ని నేను నమ్మలేదు. పుస్తకాలు చదివి నామీద నేనే ప్రయోగాలు చేసుకోసాగాను. కొంత నమ్మకం వచ్చాక అప్పట్లో నా స్నేహితుడి భార్య గర్భసంచిలో పెద్ద గడ్డ చేరి ఆపరేషన్ చేయాలంటేనూ... నా హోమియో మందులతో నెలలో తగ్గించగలిగాను. ఈలోపు అమెరికాలో పోస్ట్ డాక్టరల్ ఫెలోషిప్ రావడంతో... హోమియోపతిని కాస్త పక్కనపెట్టి అక్కడికెళ్ళాను. వెళ్ళిన మొదటి రోజే ఆ పాపని చూశాను.