Father Dead Body: రక్తసంబంధీకులు చనిపోతే భుజాలపై మోసుకెళ్లడం, ద్విచక్ర వాహనాలపై తీసుకెళ్లడం లాంటి ఎన్నో ఘటనలు చూశాం. అయినవారి అంత్యక్రియలు ఘనంగా చేయాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ ఇక్కడ మాత్రం పూర్తి భిన్నంగా జరిగింది. ఓ తనయుడు తండ్రి మృతదేహాన్ని తీసుకెళ్లి అంత్యక్రియలు చేయలేక.. ఘాట్ రోడ్లో పడేసి చేతులు దులుపుకున్నాడు.
ఆర్థిక స్తోమత లేక:వైయస్సార్ జిల్లా దువ్వూరు మండలానికి చెందిన రాజశేఖర్ రెడ్డి క్లీనర్‌గా పని చేస్తున్నాడు. అతని తండ్రి చిన్న పుల్లారెడ్డి గత కొంత కాలం నుంచి క్షయ వ్యాధితో బాధపడుతున్నాడు. కొడుకు నిర్లక్ష్యం చేయడంతో వ్యాధి ఎక్కువైంది. దీంతో తండ్రిని కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్పించాడు. ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ కొడుకు తండ్రిని పట్టించుకోలేదు. ఆస్పత్రి నిర్వాహకులు ఫోన్ చేసి మీ తండ్రి ఆరోగ్యం క్షీణించిందని చెప్పడంతో ఫిబ్రవరి 23వ తేదీ ఆస్పత్రికి వెళ్లి తన తండ్రిని డిశ్చార్జ్ చేసి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు. తండ్రి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లేందుకు, అంత్యక్రియలు చేసేందుకు ఆర్థిక స్తోమత లేకపోవడంతో తండ్రి మృతదేహాన్ని నిర్లక్ష్యంగా గువ్వల చెరువు ఘాట్ రోడ్లో పడేసి వెళ్లాడు. దాదాపు రెండు నెలల అనంతరం ఏప్రిల్ 29వ తేదీ ఘాట్ రోడ్లో దుర్వాసన రావడంతో స్థానికులు గుర్తించి విషయాన్ని చింతకొమ్మదిన్నె పోలీసులకు తెలియజేశారు.