బీటెక్ అయినా...ఎంటెక్ అయినా...కార్పొరేట్ కొలువు దక్కాలంటే మెరుగైన నైపుణ్యాలు తప్పనిసరి. సంస్థలు కోరుకునే ప్రతిభ ఉన్న వారికే ఉపాధి. మిగిలిన వారి ఉద్యోగాన్వేషణలో అనేక అవస్థలు. అలాంటివారికి ఉపాధి, ఉద్యోగావకాశాల కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నాయి.. ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రాలు. దేశవ్యాప్తంగా జిల్లాస్థాయిల్లో యువతకు నైపుణ్యాలకు సాన బెడుతున్నాయి. ఇదేరీతిలో కడప ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రం ..వేలాది యువత ఉత్తమ భవిష్యత్తుకు బాటలు వేస్తోంది.
కడప జిల్లా కేంద్రంగా 2018 మే 5 న ఏర్పాటైన ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రం ఇప్పటివరకూ సుమారు 3 వేల మంది నిరుద్యోగ యువతకు నాణ్యమైన శిక్షణ అందించింది. ఈ కేంద్రంలో తర్ఫీదు పొందిన విద్యార్థులకు నేషనల్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సర్టిఫికెట్లూ అందజేస్తోంది. స్థానికంగా శిక్షణ పొందిన యువతలో దాదాపు 50% మంది కార్పొరేట్ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సొంతం చేసుకున్నారు.
ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన కేంద్రంలో ప్రధానంగా 5 విభాగాల్లో యువతకు శిక్షణ ఇస్తున్నారు. 5వ తరగతి నుంచి బీటెక్ వరకు చదివిన నిరుద్యోగ యువతకు .. ఐటీఐ, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సోలార్ పీవీ ఇన్‌స్టలేషన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, మొబైల్ ఫోన్ హార్డ్‌వేర్, రిపేర్ టెక్నీషియన్ విభాగాల్లో తర్ఫీదు ఇస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉచిత తరగతులు నిర్వహిస్తున్నారు.
సాంకేతిక అంశాలపై ఆసక్తి చూపే నిరుద్యోగ యువతకు జావా, C ప్లస్- ప్లస్, ఫోటోషాప్, వెబ్ డిజైనింగ్ వంటి వివిధ రకాల కంప్యూటర్ ఆధారిత అంశాల్ని నేర్పిస్తున్నారు. ఈ విభాగంలో శిక్షణ పూర్తి చేసుకున్నవారు బెంగళూరు, చెన్నై ప్రైవేటుసంస్థల్లో కొలువులు దక్కించుకున్నారు.