పోలీసుల అప్రమత్తత... ఓ కుటుంబాన్ని కాపాడింది - badhwel police
ఓ వ్యాపారి ఇంట్లో పనిచేసే వ్యక్తి... యజమాని కుటుంబ సభ్యులను హతమార్చి బంగారం దోచుకోవాలని పథకం రచించాడు. చోరీకి సర్వం సిద్ధం చేశాడు. ఇంతలోనే పోలీసులకు చిక్కాడు.

కడప జిల్లా బద్వేలు పోలీసులు... ఓ హత్యాయత్నాన్ని అడ్డుకున్నారు. ఐదుగురు సభ్యుల దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... బద్వేలులోని నెల్లూరు రోడ్లో వెంకట సుబ్బయ్య అనే వ్యాపారి ఇంట్లో సుభాష్ పనిచేస్తున్నాడు. వెంకట సుబ్బయ్య ఇంట్లో చోరీ చేసేందుకు సుబాష్ పథకం రచించాడు. యజమాని కుటుంబ సభ్యులను హతమార్చి బంగారు ఆభరణాలను దోచుకోవాలనుకున్నాడు. మరో నలుగురి సాయం తీసుకుని రెక్కీ నిర్వహించారు. పట్టణ సీఐలు మధ్యాహ్నం వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా తిరుగుతున్న సుభాష్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. అప్పుడే ఈ భారీ చోరీ విషయం వెలుగు చూసిందని మైదుకూరు డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. వీరిలో ఇద్దరికి నేరచరిత్ర ఉందని వెల్లడించారు. నిందితుల నుంచి రెండు పిడిబాకులు, రెండు ఇనుప రాడ్లు, ఒక ఎక్స్‌లేటర్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.