కడపలో కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. కడప శివారులోని అల్లూరి సీతారామరాజు నగర్ మొత్తం నీట మునిగింది. సుమారు కొన్ని వందల నివాసాల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. విష కీటకాలు, పాములు, చెత్తా చెదారం నివాసాల్లోకి రావడంతో ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. కొంతమంది నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. నిన్ననే ఉపముఖ్యమంత్రి అంజద్ బాషా అల్లూరి సీతారామరాజు నగర్‌ను పరిశీలించారు. అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
కుందూనదిలో పెరిగిన ప్రవాహం
కడప జిల్లాలోని కుందూ నదిలో మళ్ళీ వరద ప్రవాహం పెరిగింది. మంగళవారం సాయంత్రం 37 వేల 863 క్యూసెక్కుల నీరు ఉండగా... నేటి ఉదయానికి 39 వేల 172 క్యూసెక్కులకు చేరింది. మూడు రోజుల కిందట 32 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం ఉండేది. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ, నంద్యాల ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో వరద ప్రవాహం పెరుగుతున్నట్లుగా కేసీ కెనాల్ అధికారులు తెలిపారు.