కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేశులలోని ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణంలో వినాయకుడి విగ్రహం చేయి ధ్వంసంపై పోలీసులు నిగ్గు తేల్చారు. మతిస్థిమితం లేని మహిళ చర్యే కారణమని డీఎస్పీ బి.విజయ్‌కుమార్ వెల్లడించారు. బుధవారం వినాయకుడి విగ్రహం ఎడమ చేయి ధ్వంసం చేయడంపై ఆలయ ఛైర్మన్ సత్యనారాయణ ఫిర్యాదుతో ఎస్సై అరుణ్‌రెడ్డి విచారణ చేపట్టారు. అందులో భాగంగానే గురువారం వేలిముద్రల నిపుణులు, పోలీసు జాగిలాన్ని రప్పించి అన్వేషించారు.
జాగిలం మతిస్థిమితం లేని మహిళ ఇంటి వద్ద ఆగడంతో ఆమె చర్యే కారణమని భావించారు. ఘటనకు పాల్పడింది... మతిస్థిమితం లేని మహిళ కావటంతో నిందితురాలుగా చేర్చే అవకాశం లేకపోయింది. ఈ కారణంగా.. పోలీసులు మహిళను మానసిక వైద్యాలయానికి పంపేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.