పెన్నానది ప్రమాదంలో మృతి చెందిన యువకుల కుటుంబాలను ప్రభుత్వం పరిహారమిచ్చి ఆదుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఏడుగురు యువకులు మృతి చెందటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న యువకులు...అకాల మరణానికి గురైతే ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతమన్న చంద్రబాబు...మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మిగిలిన మృతదేహాలను వీలైనంత త్వరగా వెలికి తీయించి బంధువులకు అప్పజెప్పాలన్నారు.
పాలకులకు నదుల్లో ఇసుకను ఇష్టానుసారం తవ్వుకుని సొమ్ము చేసుకోవటంపై ఉన్న శ్రద్ధ నదుల్లో స్నానాలకు వచ్చే ప్రజల ప్రాణాల మీద లేదని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. యువకులు నీట మునిగి చనిపోయిన వార్త చాలా బాధ కలిగించిందన్నారు. ప్రమాదం జరగడానికి ఆస్కారం ఉన్నచోట ప్రభుత్వం హెచ్చరిక బోర్డులు పెట్టి, భద్రత కల్పించే చర్యలు చేపట్టకపోవటం వల్లే దుర్ఘటన జరిగిందని విమర్శించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తగిన పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.