ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తైక్వాండోలో రాణిస్తున్న బద్వేలు యువతి...! - Thaikwando Gold Medalist keerthi

సమాజంలో మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలు, అత్యాచారాలను ధైర్యంగా ఎదుర్కోవాలంటే ఆత్మరక్షణ విద్యే శరణ్యమని భావించింది ఆ యువతి. దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఆమె మనసును కలచివేసింది. తన లాంటి అమ్మాయిలకు అలాంటి ఘటన ఎదురైతే ఎలా... అనే ఆలోచించి తైక్వాండో నేర్చుకోవాలని సంకల్పించింది కడప జిల్లా బద్వేలుకు చెందిన కీర్తి. తండ్రి లేకపోయినా తల్లి ప్రోత్సాహంతో రాష్ట్ర, జాతీయ స్థాయిలో బంగారు పతకాలు సాధిస్తూ అందరి మన్ననలు పొందుతున్నఈ యువతి పై ఈటీవీభారత్ ప్రత్యేక కథనం.

Badwells is a sportswoman who excels in taekwondo
తైక్వాండోలో రాణిస్తున్న బద్వేలు యువతి

By

Published : Mar 23, 2020, 3:26 PM IST

తైక్వాండోలో రాణిస్తున్న బద్వేలు యువతి

విద్యార్థులకు తైక్వాండోలో శిక్షణ ఇస్తున్న ఈ యువతి పేరు కీర్తి. స్వస్థలం కడప జిల్లా బద్వేలు. తండ్రి చనిపోగా.. తల్లి ఆసరాతో డిగ్రీ చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన కీర్తిని 2012లో దిల్లీలో జరిగిన నిర్భయ ఘటన కలచి వేసింది. సమాజంలో ఇలాంటి రాక్షసులు నుంచి తనను తాను రక్షించుకోవాలంటే ఏం చేయాలో ఆలోచించింది. అంతే తడవుగా బద్వేలు పట్టణంలో తైక్వాండో శిక్షణ ఇస్తున్న వెంకటసుబ్బయ్య వద్ద చేరింది. 2017 నుంచి తైక్వాండో నేర్చుకోవడం మెుదలుపెట్టింది. మూడేళ్లలోనే తైక్వాండోలో రాణించి...జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో 16 బంగారు, 5 వెండి పతకాలను సొంతం చేసుకుంది ఈ యువతి.

సడలని ధృడసంకల్పం...

తండ్రి లేని ఆడపిల్ల ఉదయం 5 గంటలకే తైక్వాండో శిక్షణకు ఒంటరిగా ఇంటి నుంచి వెళ్తుంటే బంధువులతో పాటు... స్థానికులు హేళన చేసేవారు. కానీ మొక్కవోని పట్టుదల, ఆత్మవిశ్వాసంతో ఎలాగైనా ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలని సంకల్పించింది కీర్తి. అనతి కాలంలోనే తైక్వాండోలా రాణించింది. అమ్మాయి ఆత్మరక్షణ విద్యలో రాణించడం చూసిన కుటుంబ సభ్యులు... నాడు అభ్యంతరం చెప్పిన వారే నేడు ప్రోత్సహిస్తున్నారు.

సింధు స్థాయికి ఎదగాలనుంది...

ఓ వైపు వెంకటసుబ్బయ్య వద్ద తైక్వాండో శిక్షణ తీసుకుంటూనే ... బద్వేలు ఏవీఆర్ పాఠశాల విద్యార్థులకు సైతం ఆత్మరక్షణ విద్య నేర్పిస్తోంది ఈ యువతి. భవిష్యత్తులో పీవీ సింధు, గోపిచంద్ లాంటి వారి స్థాయికి ఎదుగుతానంటుంది. అంతేకాక పోలీసు కొలువు సాధించాలని ఉందని తన మనసులోని మాట బయటపెట్టింది కీర్తి.

స్థలం కేటాయిస్తే బాగుంటుంది...

తైక్వాండోలో రాణిస్తున్న కీర్తి పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిరంతరం తైక్వాండోలో సాధన చేస్తూ ఏదో సాధించాలనే పట్టుదల ఆమెలో కనిపిస్తోందని శిక్షకుడు వెంకటసుబ్బయ్య అంటున్నారు. శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం తగిన స్థలం కేటాయిస్తే.. కీర్తి లాంటి ఆణిముత్యాలు మరికొందరు బయటికి వస్తారని కోచ్ తెలుపుతున్నారు.

భర్తను కోల్పోయిన కీర్తి తల్లి... ఇంటికే పరిమితం అయినప్పటికీ... కుమార్తె సాధిస్తున్న విజయాలను చూసి సంతోషం వ్యక్తం చేస్తోంది. కీర్తి లాంటి క్రీడాకారులు మరికొందరు బయటికి రావాలంటే ప్రభుత్వం తగిన ప్రోత్సాహం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇవీ చదవండి...'సమీరా' రాకెట్.. గ్రాండ్​స్లామ్​పై గురిపెట్టెన్​

ABOUT THE AUTHOR

...view details