YS Viveka Murder Case: ‘కడప ఎంపీ వై.ఎస్.అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్‌రెడ్డిపై ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి బాగా ఆప్యాయత కనబరుస్తారు. వై.ఎస్.భారతి తల్లి ఈసీ సుగుణమ్మ.. వై.ఎస్.అవినాష్‌రెడ్డికి మేనత్త. అవినాష్‌రెడ్డి తల్లి లక్ష్మమ్మ.. భారతికి మేనత్త. అందుకే వారంటే జగన్‌కు అభిమానం. అవినాష్ అనుచరుడైన శివశంకర్‌రెడ్డికి అందుకే జగన్‌మోహన్‌రెడ్డితో సన్నిహిత సంబంధాలున్నాయి’ అని మాజీమంత్రి వై.ఎస్.వివేకానందరెడ్డి అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి చెప్పారు. వివేకా హత్యలో శివశంకర్‌రెడ్డి పాత్ర ఉందంటూ అవినాష్‌రెడ్డి దృష్టికి తన భార్య సునీత తీసుకెళ్లగా.. ఆయన దాన్ని ఖండించి శివశంకర్‌రెడ్డిని వెనకేసుకొచ్చారని తెలిపారు. వివేకా హత్య తర్వాత ఓ రోజు హైదరాబాద్ విమానాశ్రయంలో అవినాష్‌ను సునీత కలిసినప్పుడు వారి మధ్య ఈ సంభాషణ చోటుచేసుకుందన్నారు. శివశంకర్‌రెడ్డి హత్యలు చేయడంటూ సునీతతో అవినాష్ చెప్పారని వివరించారు. ఈ మేరకు రాజశేఖర్‌రెడ్డి సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలోని మరికొన్ని అంశాలు తాజాగా వెలుగుచూశాయి. వివరాలివే.
శివశంకర్‌రెడ్డి చెప్పిన వారికే పులివెందుల సీఐ పోస్టింగ్
శివశంకర్‌రెడ్డి ఓ చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. 2005లో ఆయన ఓ వ్యక్తిని హత్య చేశారని, అది చూసిన ఇద్దరు పిల్లల్ని కూడా చంపారని ఆరోపణలున్నాయి. అప్పటి నుంచి అతను ఎవర్నీ నేరుగా చంపరని.. ఇతరులతో ఆ పని చేయిస్తారని ప్రచారం ఉంది. సమాజంలో అతనికి చెడ్డ పేరు ఉండటంతో వివేకా దగ్గరికి తీసుకునేవారు కాదు. వివేకా మినహా వైఎస్‌ఆర్ కుటుంబంలోని మిగతావారు ఆయన్ను కాపాడేవారు. అందుకే అతనిపై క్రిమినల్ కేసులు నమోదుకాలేదు. తర్వాత కాలంలో శివశంకర్‌రెడ్డి కడప జిల్లాలో శక్తిమంతమైన వ్యక్తిగా ఎదిగారు. కాంట్రాక్టు పనులు, ప్రభుత్వోద్యోగుల బదిలీలు తదితర వ్యవహారాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. శివశంకర్‌రెడ్డి ఎవరికి చెబితే వారికే పులివెందుల సీఐగా పోస్టింగ్ లభిస్తుంది. 2009లో సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా మా మామ వివేకానందరెడ్డి పులివెందులలో శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టారు. అదే సందర్భంలో దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి మాత్రం హింసాత్మక చర్యలకు పాల్పడ్డారు. బీఎస్‌ఎన్‌ఎల్ ఆస్తులను ధ్వంసం చేశారు. అలా చేసినవారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వివేకా ఒకరోజు నిరాహారదీక్ష చేశారు. అప్పటి నుంచి వివేకాపై శివశంకర్‌రెడ్డి మరింత కోపం పెంచుకున్నారు.