YS Viveka murder Case: వై.ఎస్.వివేకానందరెడ్డితో వైకాపా ఎంపీ అవినాష్‌రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డికి అటు రాజకీయంగా, ఇటు బంధుత్వ పరంగా శత్రుత్వం ఉందని సీబీఐకి ఇచ్చిన వాంగ్మూలంలో వివేకా కుమార్తె నర్రెడ్డి సునీత పేర్కొన్నారు. 2009లో వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణం తర్వాత పులివెందుల శాసనసభ స్థానం ఉప ఎన్నికలో భాస్కర్‌రెడ్డి పోటీ చేయాలనుకున్నారని, కానీ విజయమ్మ.. లేదా షర్మిల పోటీచేయాలని వివేకా సూచించారని ఆమె తెలిపారు. వివేకానందరెడ్డి హత్య ఘటనలో ప్రమేయానికి సంబంధించి అవినాష్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి సహా ఎవరెవరిపై తనకు ఎలాంటి అనుమానాలున్నాయో, దానికి కారణాలేంటో సీబీఐకి ఆమె తెలియజేశారు. వివేకా చనిపోయాక హత్యాస్థలంలో ఆధారాల్ని తుడిచేయాలని భాస్కర్‌రెడ్డి తనను ఆదేశించినట్టు ఎర్ర గంగిరెడ్డి చెప్పడం కూడా ఆయనపై తన అనుమానానికి కారణంగా పేర్కొన్నారు. ‘ఎంపీ అవినాష్‌రెడ్డికి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అత్యంత సన్నిహితుడు. అతన్ని అవినాష్‌రెడ్డి కాపాడుతున్నారు. శివశంకర్‌రెడ్డి, ఈసీ సురేంద్రరెడ్డిలను తీసుకుని 2019 ఆగస్టు 31న అవినాష్‌రెడ్డి డీజీపీని కలవాల్సిన అవసరమేంటి?’ అని ఆమె ప్రశ్నించారు. వివేకా హత్యకు ముందు రోజు (2019 మార్చి 14) మధ్యాహ్నం నుంచి చోటుచేసుకున్న పరిణామాల్ని, ఎవరు ఎవరెవరికి ఫోన్లు చేశారన్న వివరాల్నీ ఆమె సీబీఐకి అందజేశారు. వై.ఎస్.మనోహర్‌రెడ్డి ప్రమేయంపైనా అనుమానాలున్నాయని, ఆధారాలు తుడిచేయాలని తనకు మనోహర్‌రెడ్డి సూచించినట్టుగా ఎర్ర గంగిరెడ్డి పోలీసుల విచారణలో చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఎర్ర గంగిరెడ్డి ఒక్కోసారి ఒక్కొక్కరి పేరు చెప్పారన్నారు. ఇంకా ఆమె అనుమానితులుగా పేర్కొన్నవారిలో కొందరి వివరాలు.. వారిని అనుమానించడానికి ఆమె చెప్పిన కారణాలు ఇవీ..!
దేవిరెడ్డి శివంకర్‌రెడ్డి
(అవినాష్‌రెడ్డి కుటుంబానికి సన్నిహితుడు)
వివేకానందరెడ్డి అంటే శివశంకర్‌రెడ్డికి భయం. ఆయనకు ఎదుటపడేవారు కాదు. వివేకా ఇంట్లోకి ఆయన అడుగుపెట్టేవారే కాదు. అలాంటి శివశంకర్‌రెడ్డి... మార్చి 15న ఉదయం వివేకా హత్య జరిగిన ప్రదేశం నుంచి అవినాష్‌రెడ్డి వెళ్లిపోయాక కూడా అక్కడే ఉన్నారు. శివశంకర్‌రెడ్డిపై గతంలో చాలా నేరారోపణలు ఉన్నాయి. 2017లో వివేకా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ఆయన కారకుడు. సంఘటన జరగడానికి ముందురోజు రాత్రి 8 గంటలకు ఎర్ర గంగిరెడ్డికి ఆయన ఫోన్ చేశారు. వివేకా మృతదేహాన్ని చూడటానికి ముందు ఒకసారి, చూసిన తర్వాత ఒకసారి సాక్షి విలేకరికి శివశంకర్‌రెడ్డి ఫోన్ చేశారు. ఉదయం 6.24కి 141 సెకన్లు, ఉదయం 6.46కి 17 సెకన్లు ఆయనతో మాట్లాడారు. వివేకా గుండెపోటుతో చనిపోయారన్న నిర్ధారణకు శివశంకర్‌రెడ్డి ఎలా వచ్చారు? ఆ విషయాన్ని విలేకరికి ఎప్పుడు చెప్పారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని విలేకరికి తానే చెప్పినట్టు ఆ తర్వాత పోలీసుల విచారణలో శివశంకర్‌రెడ్డి అంగీకరించారు. హత్యాస్థలంలో ఫొటోలు తీయడానికి శివశంకర్‌రెడ్డి ఎవర్నీ ఎందుకు అనుమతించలేదు? అది నేరం జరిగిన ప్రదేశం (క్రైమ్ సీన్) అని ఆయనకు ముందే తెలియడం వల్లేనా? మరి ఆధారాలు ఎందుకు చెరిపేశారు? వివేకా మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించినంత సేపూ ప్రతి విషయాన్నీ శివశంకర్‌రెడ్డికి డాక్టర్ సతీష్ ఎందుకు చెబుతూ వచ్చారు?
ఉదయ్‌కుమార్‌రెడ్డి
(తుమ్మలపల్లెలోని యురేనియం కర్మాగారంలో ఉద్యోగి. అవినాష్‌రెడ్డికి సన్నిహితుడు. ఈసీ గంగిరెడ్డి ఆస్పత్రిలో కాంపౌండర్ ప్రకాష్‌రెడ్డి కొడుకు. వివేకా శరీరంపై గాయాలకు బ్యాండేజి కట్టినవారిలో ప్రకాష్‌రెడ్డి ఉన్నారు)