Tension at Kadapa Shawali Dargah: కడప నగరంలోని మోచంపేట షావలీ దర్గాకు, రామకృష్ణ పాఠశాలకు సంబంధించిన స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. దర్గా స్థలంలో వైసీపీ బడా నాయకులు, ప్రభుత్వం అండతో ప్రహరీ గోడ నిర్మించి ఆక్రమించారని ముస్లిం పెద్దలు ఆందోళన చేపట్టారు. ఈ రోజు పెద్ద ఎత్తున ముస్లింలు మసీదుల నుంచి ర్యాలీలు, ధర్నాలు చేస్తారనే సమాచారంతో ఉదయం 11 గంటల నుంచి భారీగా పోలీసులు దర్గా స్థలం వద్ద మోహరించారు. బాష్పవాయువు గోళాలు, ముళ్లకంచెలను సైతం సిద్ధం చేశారు. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి బందోబస్తు పర్యవేక్షించారు.
కొందరు ముస్లిం పెద్దలు దర్గా స్థలం వద్దకు ర్యాలీగా వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. వారితో వాగ్వాదం చేసి బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. వైసీపీ ప్రభుత్వం అండతో.. కడపకు చెందిన ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా ప్రోద్భలంతోనే అక్రమంగా ప్రహరీగోడ నిర్మించారని దర్గా ప్రతినిధులు ఆరోపించారు. హైకోర్టులో స్టే ఉన్నా దర్గా స్థలంలో ప్రహరీ గోడ ఏవిధంగా నిర్మిస్తారని ప్రశ్నించారు. వైసీపీకి చెందిన పెద్దల హస్తం ఉండటంతోనే పోలీసులు భారీగా మోహరించారని.. మరోసారి ఆందోళన చేసి దర్గా స్థలాన్ని కాపాడుకుంటామని ముస్లింలు హెచ్చరించారు.