ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. వైకాపా కౌన్సిలర్లు అరెస్టు - ప్రొద్దుటూరులో ఉద్రిక్తత

Proddutur: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో రోడ్డు విస్తరణలో భాగంగా.. దర్గాచెట్టు గోడ కూల్చివేత ఘటన అధికార పార్టీని ఉక్కిరిబిక్కిరి చేసింది. అధికారులు, ఎమ్మెల్యే తీరుపై వైకాపాలోని ముస్లిం కౌన్సిలర్లు తీవ్రస్థాయిలో విరుచుకు పడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు వాహనాన్ని అడ్డగించి ఆందోళనకు దిగారు. ఇవాళ ఉదయంలోపు గోడ పునర్నిర్మాణం చేయకపోతే కౌన్సిలర్లంతా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. ఆందోళనలతో దిగొచ్చిన ఎమ్మెల్యే.. కూల్చేసిన చోటే గోడ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

Tension at proddatur
Tension at proddatur

By

Published : Jun 27, 2022, 6:26 PM IST

Updated : Jun 28, 2022, 7:16 AM IST

Tension at Proddutur: వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని గవిని సర్కిల్‌ నుంచి బైపాస్‌ రోడ్డు వరకు కోటి రూపాయలతో చేపట్టిన రోడ్డు విస్తరణలో భాగంగా.. సర్కిల్‌ వద్ద ఇరువైపులా ఆక్రమణలు, కట్టడాలను తొలగిస్తున్నారు. దాన్లో భాగంగా ముస్లింలకు సంబంధించిన దర్గా చెట్టు గోడలను మున్సిపల్ అధికారులు జేసీబీతో కూల్చివేయడంతో ఉద్రిక్తత పరిస్థితి తలెత్తింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా విస్తరణ పేరుతో దర్గా చెట్టును కూల్చి వేయడంపై నలుగురు వైకాపా కౌన్సిలర్లు, వైస్‌ ఛైర్మన్‌ ఖాజా.. అధికారుల తీరును నిరసిస్తూ ధర్నా చేపట్టారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. మైనారిటీ వర్గానికి చెందిన అనుచరులు పెద్ద సంఖ్యలో స్టేషన్‌ వద్ద ఆందోళన చేయడంతో అరెస్ట్‌ చేసిన కౌన్సిలర్లను పోలీసులు వదలిపెట్టారు. స్టేషన్ నుంచి బయటికి వచ్చిన కౌన్సిలర్లు మరోసారి గవిని సర్కిల్‌ వద్ద దర్గాచెట్టుగోడను కూల్చిన ప్రదేశంలో ధర్నాకు దిగారు. గోడను పునర్నిర్మించే వరకు కదిలే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ఆ ప్రాంతానికి పెద్ద సంఖ్యలో అనుచరులు వస్తున్నారనే సమాచారంతో మరోసారి కౌన్సిలర్లను అరెస్ట్‌ చేసి రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌కు తరలిస్తుండగా.. కొత్తపల్లి సర్పంచ్‌ శివచంద్రారెడ్డి అడ్డుకున్నారు. అతన్ని అరెస్ట్‌ చేసి వాహనంలో ఎక్కించారు. ఇదే సమయానికి అటుగా వస్తున్న తెలుగుదేశం నేత ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి పోలీసుల తీరును ప్రశ్నించగా.. ఆయన్నీ అరెస్ట్‌ చేశారు.

చెప్పుతో కొట్టుకున్న తెదేపా నేత :వైకాపా ముస్లిం వ్యతిరేక పార్టీ అని ఇప్పటికైనా మైనారిటీ నేతలు గ్రహించాలని తెలుగుదేశం పార్టీ మైదుకూరు నియోజకవర్గ బాధ్యుడు ప్రవీణ్‌కుమార్‌ రెడ్డి సూచించారు. తెలుగుదేశం మాజీ కౌన్సిలర్‌ తనయుడు ఖలీల్‌ చెప్పుతో కొట్టుకుని నిరసన తెలిపారు. ముస్లిం ఓట్లతో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రాచమల్లు ప్రసాదరెడ్డి ఇప్పుడు తమ మనోభావాలు దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

కౌన్సిలర్ల నచ్చజెప్పిన ఎమ్మెల్యే: కౌన్సిలర్లు, తెలుగుదేశం నాయకులను రాజుపాలెం పోలీస్‌స్టేషన్‌ నుంచి మళ్లీ ప్రొద్దుటూరు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌ తీసుకొచ్చారు. ఠాణా వద్ద పెద్ద సంఖ్యలో మైనారిటీ వర్గానికి చెందిన ముస్లింలు గుమికూడి ఆందోళన చేపట్టడంతో.. పరిస్థితి చేయి దాటుతోందని గ్రహించిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి స్వయంగా స్టేషన్‌కు వచ్చి కౌన్సిలర్లను బయటికి పిలిపించి.. కూల్చేసిన చోటే గోడ నిర్మిస్తామని హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది.

కౌన్సిలర్లతో మాట్లాడి వెళ్తున్న ఎమ్మెల్యేను ముస్లింలు అడ్డుకున్నారు. ఆయన వాహనంపై దాడికి యత్నించారు. దీంతో ఎమ్మెల్యే అనుచరులు వారిని నిలవరించారు.

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత.. వైకాపా కౌన్సిలర్లను అరెస్టు చేసిన పోలీసులు

ఇదీ చదవండి:

Last Updated : Jun 28, 2022, 7:16 AM IST

ABOUT THE AUTHOR

...view details