TDP critism on Ramasubba reddy: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రాజకీయ విమర్శలు ప్రతివిమర్శలతో వైసీపీ, టీడీపీ నేతలు కాక పుట్టిస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి ఎంపిక కావడంతో రాజకీయాలు మరింత వేడెక్కాయి.. కొన్నాళ్ల క్రితం వరకు కడప జిల్లా జమ్మలమడుగు రాజకీయాల్లో టీడీపీ నేతగా కీలకంగా వ్యవహరించిన రామసుబ్బారెడ్డి పార్టీ మారడంతో టీడీపీ, వైసీపీ నేతల మాటల యుద్దం మొదలైంది. ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి పోటీలో నిలిచి ప్రత్యర్థి పార్టీ.. టీడీపీపై విమర్శలు చేయడం చర్చనీయాంశమైనది.
కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా రామసుబ్బారెడ్డి దొంగదారిలో ఎంపికయ్యారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి మండిపడ్డారు. కడపలోని పార్టీ కార్యాలయంలో శ్రీనివాసులు రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో రామసుబ్బారెడ్డి అడ్డదారిలో విజయం సాధించారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ దిగజారి ప్రవర్తిస్తోందన్న రామసుబ్బా రెడ్డి విమర్శలను ఆయన తిప్పిగొట్టారు.
పదవీ కాంక్షతోనే పార్టీ మారారు : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపికైన రామసుబ్బారెడ్డిని.. గత 30 ఏళ్ల నుంచి టీడీపీ అల్లుని వలే పోషించిందని శ్రీనివాసులు రెడ్డి అన్నారు. పదవీ కాంక్షతో అదును చూసి పార్టీ మారిన రామసుబ్బారెడ్డి.. టీడీపీని విమర్శించే హక్కు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెజార్టీ వైసీపీకే ఉందని భావించినప్పుడు ధైర్యంగా పోటీ చేసి ఉండాల్సిందని సవాల్ విసిరారు. పోటీ చేస్తే క్రాస్ ఓటింగ్ జరుగుతుందనే భయంతో దొంగదారిలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎంపిక చేయించుకున్నారన్నారు.