Nara Lokesh Yuvagalam టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర ఆదివారం 123వ రోజుకు చేరింది. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగింది. టీడీపీ శ్రేణులు అడుగడుగునా లోకేశ్‌కు స్వాగతం పలికాయి. శనివారం నాటికి 1556.7 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేసిన లోకేశ్.. ఆదివారం విడిది కేంద్రంలో రైతులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడిన లోకేశ్.. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
రైతులకు తీరని అన్యాయం.. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం రైతులతో నారా లోకేశ్ సమావేశంలో పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని రైతులు రైతులు ఫిర్యాదు చేశారు. రాయలసీమ రైతులకు నీరు ఇస్తే బంగారం పండిస్తారనీ... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పాత డ్రిప్ ఇరిగేషన్ విధానాన్ని తీసుకొస్తాం అని లోకేశ్ హామీ ఇచ్చారు. జగన్ పాలనలో రైతులు నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు, నకిలీ పురుగుల మందులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. రాయలసీమకి జీవనాడి డ్రిప్ ఇరిగేషన్... అలాంటి డ్రిప్ పై సబ్సిడీ ఎత్తేసి నాలుగేళ్లలో రైతులకి తీరని అన్యాయం చేశాడు జగన్ అని విమర్శించారు.
రాయలసీమ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.. రాయలసీమ ప్రాజెక్టుల కోసం టీడీపీ ప్రభుత్వం.. 11,700 కోట్లు ఖర్చు చేస్తే... జగన్ ప్రభుత్వం అందులో 10 శాతం కూడా ఖర్చు చెయ్యలేదని అన్నారు. 49 మంది ఎమ్మెల్యేలను రాయలసీమ లో గెలిపిస్తే జగన్ రాయలసీమకి ఇచ్చింది ఏమిటి అని ప్రశ్నించిన లోకేశ్.. వైఎస్సార్ పార్టీ కి 2019 లో ఇచ్చిన సీట్లు మాకు ఇవ్వండి రాయలసీమ ని అభివృద్ధి చేసి చూపిస్తాం అని అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భవిష్యత్తు కు గ్యారెంటీ పేరుతో అన్నదాత కు 20 వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తాం అని అన్నారు. చంద్రబాబు గారు ఒకే సంతకంతో రూ. 50 వేల లోపు ఉన్న పంట రుణాలు అన్నీ మాఫీ చేశారని లోకేశ్ గుర్తు చేశారు.
కుందూ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం... సోమశిల ప్రాజెక్టు ముంపు బాధితులకు అన్యాయం జరిగిందని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం చేస్తామని చెప్పారు. మొదటి 18 నెలల్లో పరిహారం అందిస్తామని తెలిపారు. బద్వేల్ నియోజకవర్గం లో పెండిగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తే అదనంగా మరో 80 వేల ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం ఉందని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఇసుక దోపిడీ లో జే ట్యాక్స్ రోజుకి రూ.3 కోట్లు అని ఆరోపిచారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే కుందూ ప్రాజెక్ట్ పూర్తి చేసి సాగునీరు అందిస్తాం అని హామీ ఇచ్చారు.