TDP MLC Ramgopal Reddy fired on Pulivendula firing incident: ఆర్థికలావాదేవీల కారణంగా ఈరోజు వైఎస్సార్ జిల్లా పులివెందులలో భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి తుపాకీతో ఇద్దరు వ్యక్తులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయాలపాలైన దిలీప్‌ను కడప రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందగా.. మహబూబ్ బాషా అనే వ్యక్తి పులివెందులలోని ప్రాంతీయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
ఈ నేపథ్యంలో పులివెందులలో జరిగిన తుపాకీ ఘటనపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి.. పులివెందుల కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అనంతరం అనేక అరాచకాలకు కేంద్ర బిందువుగా ఉన్న భరత్ యాదవ్ అనే వ్యక్తికి పోలీసులు లైసెన్స్ తుపాకీ ఎలా ఇచ్చారని..పోలీస్ అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి మాట్లాడుతూ..''పులివెందులలో జరిగిన కాల్పుల ఘటనపై జిల్లా పోలీసు యంత్రంగా వెంటనే సమగ్రమైన విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నాను. భరత్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఒక విలేఖరి ముసుగులో అనేక రకాలైనా అరాచాలకు, విధ్వంసాలకు పాల్పడటం జరుగుతుంది. ఆ ముగ్గురి మధ్య వచ్చిన విభేదాలు ఎందుకొచ్చాయో జిల్లా పోలీసులు యంత్రాంగంతోపాటు రాష్ట్ర ప్రజానీకం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కొంతమంది పులివెందుల పోలీసుల సహాయంతో గతకొన్ని నెలలక్రితం ఈ ముగ్గురు వ్యక్తులు మట్కా కంపెనీని స్థాపించి పెద్దఎత్తున ప్రజల సొమ్ము దోపిడి చేయడం జరిగింది. ఆ వ్యాపారంలో వచ్చిన ఆర్థికలావాదేవీల కారణంగానే ఈ ఘటన జరిగింది.'' అని ఆయన అన్నారు.
అనంతరం అనేక అరాచకాలకు కేంద్ర బిందువుగా ఉన్న భరత్ యాదవ్ అనే వ్యక్తికి పోలీసులు లైసెన్స్ తుపాకీ ఎలా ఇచ్చారని.. ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి ప్రశ్నించారు. పులివెందుల సీఐ రాజు వ్యవహార శైలిపైనా కూడా విచారణ జరగాలన్నారు. గతంలోనూ భరత్ యాదవ్ ఓసారి హత్యాయత్నం చేసి తుపాకీ దుర్వినియోగానికి పాల్పడ్డాడని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తుపాకీ స్వాధీనం చేసుకోవాలని ఈసీ ఇచ్చిన ఆదేశాలను పోలీసులు ఎందుకు పాటించలేదని నిలదీశారు. ఎమ్మెల్సీగా గెలుపొందిన తనకు.. అధికారపక్షం నుంచి ముప్పు పొంచి ఉందని తెలిసి కూడా ఇంతవరకూ ఎలాంటి భద్రతను కల్పించకుండా, అసాంఘిక శక్తులకు అండగా పులివెందుల పోలీసులు నిలుస్తున్నారని ఆరోపించారు. భరత్ యాదవ్‌కు తుపాకీ లైసెన్స్ ఇవ్వవద్దని స్పెషల్ బ్రాంచ్ అధికారులు లిఖిత పూర్వకంగా చెప్పినప్పటికీ జిల్లా యంత్రాంగం తుపాకీ లైసెన్స్ మంజూరు చేసిందని మండిపడ్డారు. ఈ గూడుపుఠాణీపై సమగ్ర దర్యాప్తు జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
పులివెందులలో కాల్పుల ఘటనపై సమగ్ర విచారణ జరపాలి ఇవీ చదవండి