TDP on YSRCP Plenary: సీఎం జగన్ రెండు రోజుల కడప జిల్లా పర్యటనలో భాగంగా ఆయన సొంత నియోజకవర్గంలోనే కర్ఫ్యూ వాతావరణాన్ని సృష్టించడం విడ్డూరంగా ఉందని.. తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి అన్నారు. సొంత నియోజకవర్గంలో పర్యటించేందుకు సీఎం ఎందుకు భయపడాల్సి వచ్చిందని ప్రశ్నించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా.. చివరకు మీడియాను కూడా ఆయన పర్యటనకు రావద్దని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మూడేళ్ల పాలనలో ఆయన రైతులకు ఏం చేశారని రైతు దినోత్సవాన్ని జరుపుకుంటున్నారని.. ధ్వజమెత్తారు. ఇది రైతు దినోత్సవం కాదని రైతు ద్రోహి దినోత్సవం అని తెలిపారు.
మూడేళ్ల కాలంలో పునాదులు వేయడం తప్ప.. ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని తెలిపారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని.. జగన్ అధికారంలోకి రాగానే 5 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. మదనపల్లెలో జరిగిన మినీ మహానాడుకు లక్ష మంది హాజరుకావడంతో వైకాపా నాయకులకు గుండెల్లో గుబులు పుట్టిందన్నారు.