ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మూడు రాజధానులు ప్రజలు కోరుకోవడం లేదు.. 2024 లో జగన్ ఓటమి ఫిక్స్: టీడీపీ నేతలు

TDP Leaders On MLC Election Victory: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు.. ప్రజల విజయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. ఈ విజయానికి కారణమైన ప్రతి ఒక్క పట్టభద్రునికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. మూడు రాజధానులు కావాలని.. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు కోరుకోవడం లేదని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం ఉన్న పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికల్లో రామగోపాల్ రెడ్డి విజయం సాధించడం గొప్ప విషయమని ఎమ్మెల్సీ బీటెక్ రవి అన్నారు.

TDP Leaders
టీడీపీ నాయకులు

By

Published : Mar 19, 2023, 7:28 PM IST

Kollu Ravindra On MLC Election Victory: ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రజా విజయమని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. 108 నియోజక వర్గ ప్రజల తీర్పు ఇది అని స్పష్టం చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికలకు ఇదే సోపానమని తెలిపారు. టీడీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని వెల్లడించారు. సజ్జల, పేర్ని నాని మతిచలించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు మూడు రాజధానులు కోరుకోవడం లేదని తెలిపారు. ఈ ప్రజా తీర్పుకు వైఎస్సార్సీపీ నాయకులకు మతి పోతోందని ఆక్షేపించారు. 7 ,10వ తరగతి వారిని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల జాబితాలో చేర్చడం దారుణమని మండిపడ్డారు.


"మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలలో.. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో మూడు స్థానాలకు పోటీ జరిగితే.. మూడు స్థానాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకోవడం అనేది చాలా శుభపరిణామం. దానికి రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యమంత్రి నిర్ణయానికి ప్రజల యొక్క సమాధానం ఎలా ఉంటుందో అని చెప్పడానికి.. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలే ఉదాహరణ.

ఉత్తరాంధ్రలో రాజధాని పెడతాను, కార్యనిర్వాహక రాజధాని అక్కడే పెడతాను, నేను కూడా అక్కడే ఉంటాను అని చెప్పినా.. అదే విధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా.. ప్రజలను మోసం చేయాలని ఈ ముఖ్యమంత్రి ప్రయత్నం చేస్తే.. మోసానికి జవాబు ఎలా ఉంటుందో రాయలసీమ ప్రజలు కూడా సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. ఇప్పటికైనా మీరు తెలుసుకోండి. ప్రజల కోసం పని చేయండి". - కొల్లు రవీంద్ర, మాజీ మంత్రి

Btech Ravi On MLC Election Victory: కడప జిల్లా పులివెందులలో ఎమ్మెల్సీ బీటెక్ రవి మీడియాతో మాట్లాడుతూ పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎన్నికలు 38 నియోజకవర్గాలలో జరిగాయని, అందులో సీఎం సొంత నియోజకవర్గం కూడా ఉందని, అలాంటిది రాంగోపాల్ రెడ్డి విజయం సాధించడం గొప్ప విషయమన్నారు.

అలాగే టీడీపీ ప్రతీ కార్యకర్త.. ఇది మా సొంత ఎలక్షన్ అని అనుకొని పని చేయడం వల్లనే ఈ ఆఖండమైన విజయం దక్కిందన్నారు. ఈ విజయానికి దోహదపడిన ప్రతి నిరుద్యోగికి, ప్రతి గ్రాడ్యుయేట్​కు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం, సొంత జిల్లాలో కూడా ఇంత వ్యతిరేకత వచ్చిందంటే వారు చేసిన అరాచకాలే కారణమన్నారు. రైతులకు ఇచ్చే ఇన్సూరెన్స్ స్కీములలో కూడా లోపభూయిష్టంగా ఉన్నాయని, అందువల్లే వ్యతిరేకత ఎక్కువగా ఉందన్నారు.

వైయస్ వివేకానంద రెడ్డి కేసులో.. వైఎస్ అవినాష్ రెడ్డికి నోటిసులు ఇవ్యడంతో.. వాళ్లే చంపారని ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయిందని, ఇవన్నీ ఈ ఎన్నికల్లో మాకు కలిసి వచ్చాయన్నారు. వీరికి కచ్చితంగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో ఈ ఓటింగ్ జరిగిందని భావిస్తున్నానని అన్నారు. తాజా ఎన్నికలతో మనకు మరింత బాధ్యత పెరిగిందని సంయమనం పాటించి వచ్చే ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు. ఇదే స్ఫూర్తితో ప్రజలందరూ ముందుకు వెళ్లాలని కోరారు.

"సంయమనం పాటించండి. కవ్వింపు చర్యలు వద్దు. కచ్చితంగా వాళ్లలో కూడా మార్పు అనేది వస్తుంది. రాకపోతే వారి ఖర్మ. మన మీద మరింత బాధ్యత పెరిగింది. కాబట్టి.. మా కార్యకర్తలకు సంయమనం కోల్పోకుండా మరింత మందిని ఆకర్షిస్తాం. 2024లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడం అనేది తథ్యం". - బీటెక్ రవి, టీడీపీ ఎమ్మెల్సీ

'మూడు రాజధానులు ప్రజలు కోరుకోవడం లేదు.. 2024లో జగన్ ఓటమి ఫిక్స్'

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details