Nara Lokesh Yuvagalam Padayatra: వైఎస్‌ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో 110వ రోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. దారి పొడవునా ప్రజలు లోకేశ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. మహిళలు, కార్యకర్తలు హారతులు, గజమాలలతో ఘన స్వాగతం పలుకుతున్నారు. ఈరోజు పాదయాత్రలో భాగంగా.. పెద్ద పసుపులచావిడి వద్ద గ్రామస్థులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ లోకేశ్‌కు వినతి పత్రాన్ని అందజేశారు. గ్రామంలో రోడ్లు, తాగునీరు, డ్రైనేజీ సమస్యల్ని తీర్చాలని కోరారు.
సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రం: బీసీ కాలనీలో నీటి మట్టానికి తక్కువగా ఉన్న రోడ్లను లెవల్ చేయాలనీ గ్రామస్థులు విన్నవించారు. శెనగ రైతులకు మద్దతు ధర క్వింటాల్ రూ.6వేల 500 ఇప్పించాలని కోరారు. గ్రామంలోని వీధిలైట్ల సమస్యను పరిష్కరించాలని వేడుకున్నారు. పంట కాలువల పూడికలు తీయించాలని కోరారు. గ్రామంలోని చెరువు ప్రమాదకరంగా ఉందని.. అందుకోసం చెరువు చుట్టూ రిటైనింగ్ వాల్ కట్టించాలనీ పేర్కొన్నారు. జమ్మలమడుగు నుంచి పెద్దపసుపుల మధ్య ఉన్న రోడ్డును డబుల్ రోడ్డుగా చేయాలని.. పెండింగ్‌లో ఉన్న సీసీ రోడ్లను నిర్మించాలి డిమాండ్ చేశారు. తమ గ్రామం నుంచి చిన్న పసుపుల, ఉప్పలపాడు, చిన్నశెట్టిపల్లికి లింకు రోడ్లు వేయాలనీ నారా లోకేశ్‌ను కోరారు. వారి సమస్యలపై సానుకూలంగా స్పందించిన లోకేశ్.. అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.