ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో నరికి..! - కడప జిల్లాలో తెదేపా నేత హత్య వార్తలు

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్ద రెక్కీ చేసిన దుండగులు.. ప్రణాళిక ప్రకారం బయటకు రప్పించి కిరాతకంగా హత్య చేశారు.

tdp leader nandam subbaiah murdered
tdp leader nandam subbaiah murdered

By

Published : Dec 30, 2020, 7:22 AM IST

తెదేపా నేత నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారు. పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద సుబ్బయ్యను చుట్టుముట్టి, కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో తల నరికేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం జరిగిన సమయంలో అక్కడకు కొద్దిదూరంలోనే పురపాలక శాఖ కమిషనర్‌, ఇతర అధికారులు ఉన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డిలే ఈ హత్య చేయించారని సుబ్బయ్య భార్య, తల్లి ఆరోపించారు. మృతుడి కుటుంబసభ్యులు, స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంటి నుంచి బయటకు రప్పించి..

ప్రొద్దుటూరు మండలం ఈశ్వరరెడ్డినగర్‌లో నందం సుబ్బయ్య (41) కుటుంబంతో కలిసి నివసిస్తున్నారు. ఆయన జిల్లా తెదేపా అధికార ప్రతినిధి. మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఓ యువకుడు ఇంటి వద్దకు వచ్చి సుబ్బయ్యను బయటకు పిలిచి, తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు. గంట తర్వాత సోములవారిపల్లె పంచాయతీ పరిధిలో పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద సుబ్బయ్య ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఓ స్వీయచిత్రం తీసుకుని.. ‘కడప వార్తలు’ అనే వాట్సప్‌ గ్రూపులో ఉదయం 9.40కి పోస్టుచేసి కింద జై తెదేపా, జైజై తెదేపా అనే వ్యాఖ్య జోడించారు. అదే అతని ఆఖరి చిత్రం. వెంటనే కొంతమంది వ్యక్తులు అతన్ని చుట్టుముట్టి.. వేటకొడవళ్లతో తలపై నరికారు. 9.50 గంటలకు ఆయన ఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయారు. ఉదయం 10.30 గంటలకు హత్య విషయం సుబ్బయ్య కుటుంబసభ్యులకు తెలిసింది. వెంటనే ఆయన భార్య సంఘటన స్థలానికి చేరుకుని రోదించారు.

ఉదయం 5 గంటల నుంచే రెక్కీ
దుండగులు ముందుగానే సుబ్బయ్య ఇంటి చుట్టూ రెక్కీ చేశారు. మంగళవారం ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకూ అయిదుగురు వ్యక్తులు తిరిగారు. అతని కదలికలు గమనించారు. అలా తిరిగిన వారిలో కొండా రవి, మరో నలుగురు ఉన్నారని సుబ్బయ్య భార్య అపరాజిత ఆరోపించారు. గతంలో రవి తన భర్తను అనేకసార్లు దూషించాడని, అక్రమంగా అత్యాచారం కేసు కూడా పెట్టించారని తెలిపారు. ఈ నేపథ్యంలోనే తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ఇటీవల పోలీసుల్ని సుబ్బయ్య కోరినా వారు స్పందించలేదని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు.

కలెక్టర్‌ రావాల్సి ఉండగా..

సోములవారిపల్లె పంచాయతీ పరిధిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కోసం మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కలెక్టర్‌, జిల్లా అధికారులు రావాల్సి ఉంది. ఈ కార్యక్రమ ఏర్పాట్లను పురపాలక శాఖ కమిషనర్‌ ఎన్‌.రాధ, ఇతర అధికారులు మంగళవారం ఉదయం పర్యవేక్షిస్తున్నారు. అదే సమయంలో అక్కడకు సమీపంలోనే హత్య జరిగింది. దీంతో పట్టాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడింది.

సామాజిక మాధ్యమాల్లో సవాల్‌

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డి క్రికెట్‌ బెట్టింగ్‌ మాఫియా డాన్‌లని, అవినీతిపరులని, వీటిని ఆధారాలతో నిరూపిస్తానంటూ ఓ సెల్ఫీ వీడియోను ఈనెల 24న సుబ్బయ్య తన ఫేస్‌బుక్‌ పేజీలో పోస్టు చేశారు. ‘‘ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డి ప్రజాకంటకులు. పదేళ్ల కిందట వారి ఆస్తి ఎంత? ఇప్పుడు వందల కోట్లు ఎలా సంపాదించారు? రామేశ్వరంలో తన అనుచరుల్ని బినామీలుగా పెట్టి రూ.80 లక్షల నుంచి రూ.1.30 కోట్లు కొట్టేశారు. ప్రొద్దుటూరు వన్‌టౌన్‌లో బంగార్రెడ్డి రౌడీషీటర్‌. ఎమ్మెల్యే, అతని బావమరిది ఇద్దరూ అవినీతిపరులే. త్వరలోనే ఆధారాలతో నిరూపిస్తాం. అప్పుడు వారు ఊరు వదిలిపెట్టి వెళ్లిపోవటానికి సిద్ధమేనా? పురపాలక కమిషనర్‌ రాధను అడ్డం పెట్టుకుని ప్రొద్దుటూరు పట్టణ సుందరీకరణ పనుల్ని బినామీ కాంట్రాక్టర్లతో చేయిస్తున్నారు. పురపాలక ఎన్నికల్లో వైకాపా నుంచి 41 మందిని కౌన్సిలర్‌ అభ్యర్థులుగా నిలిపారు. వారిలో క్రికెట్‌ బుకీలు ఎంతమంది ఉన్నారో అందరికీ తెలుసు. ప్రజాక్షేత్రంలోనే వారిని ఓడిస్తాం’’ అని ఆ సెల్ఫీ వీడియోలో ఉంది.

ఎమ్మెల్యేకు సంబంధం ఉన్నట్లు నిర్ధారణ కాలేదు: అన్బురాజన్‌, కడప ఎస్పీ

సుబ్బయ్య హత్యకు, స్థానిక ఎమ్మెల్యేకు సంబంధం ఉన్నట్లు ఇంతవరకూ నిర్ధారణ కాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం. నలుగురు వ్యక్తుల్ని గుర్తించాం.

పోలీసుల అదుపులో నిందితులు?
నందం సుబ్బయ్య హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మంగళవారం చాపాడు పోలీసుస్టేషనులో నిందితులను ఉంచినట్లు తెలుస్తోంది. వీరంతా ప్రొద్దుటూరుకు చెందినవారుగా ప్రచారం జరుగుతోంది. హత్యకు కారణాలపై స్పెషల్‌ బ్రాంచి, ఇంటెలిజెన్స్‌ ఉన్నతాధికారులు రాత్రి చాపాడు పోలీసుస్టేషనుకు చేరుకుని విచారణ చేశారు.

అన్ని కోణాల్లో దర్యాప్తు: హోంమంత్రి
హత్య ఘటనపై అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని, నిందితులకు కఠిన శిక్ష వేస్తామని హోంమంత్రి సుచరిత ఓ ప్రకటనలో తెలిపారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా శిక్ష పడటం ఖాయమని పేర్కొన్నారు. తెదేపా నేతలు ప్రతీ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని, చంద్రబాబు కులాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారని ఆమె విమర్శించారు. ఈ ఘటనపై హోంమంత్రి పోలీసు ఉన్నతాధికారులు, కడప ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సుబ్బయ్యపై అనేక కేసులు ఉన్నట్లు పోలీసులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు.

అంత్యక్రియలకు లోకేశ్‌ హాజరు
సుబ్బయ్య అంత్యక్రియలను ప్రొద్దుటూరులోని ఈశ్వర్‌రెడ్డినగర్‌లో బుధవారం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ రానున్నట్లు తెదేపా కడప పార్లమెంటు అధ్యక్షుడు లింగారెడ్డి తెలిపారు.

వారే హతమార్చారు

నా భర్తను ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డి హతమార్చారు. వారిని కఠినంగా శిక్షించాలి. న్యాయంగా మాట్లాడితే ఇలా చంపేస్తారా? గత కొన్నేళ్లుగా వాళ్లు మమ్మల్ని హింసిస్తున్నారు. గతంలో నా గురించి అసభ్యకరంగా మాట్లాడినా.. నా భర్త ఏమీ చేయకుండా తలదించుకుని ఇంటికొచ్చేశారు. మంగళవారం ఉదయం ఓ వ్యక్తి వచ్చి నా భర్తను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. అతనెవరో నాకు తెలీదు. చూస్తే గుర్తుపడతాను. నాకు న్యాయం జరిగేవరకు ఎక్కడికి వెళ్లి మాట్లాడడానికైనా సిద్ధమే.

-హతుడి భార్య అపరాజిత

సుబ్బయ్య హత్యతో సంబంధం లేదు

ప్రొద్దుటూరుకు చెందిన తెదేపా నేత నందం సుబ్బయ్య హత్యతో తనకెలాంటి సంబంధం లేదని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. తనకు గానీ, తన బావమరిదికి గానీ ఈ హత్యతో సంబంధం లేదని మంగళవారం మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. నందం సుబ్బయ్య స్త్రీ లోలుడని, అతనిది రాజకీయ హత్య కాదని చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల నుంచి సుబ్బయ్య తనపై విమర్శలు చేస్తూనే ఉన్నారని, ఏనాడూ అతన్ని ఏమీ అనలేదని, తాను హత్యలను ప్రోత్సహించనని ఎమ్మెల్యే అన్నారు. నందం సుబ్బయ్య భార్యకు తన ప్రగాఢ సంతాపం తెలుపుతున్నానని చెప్పారు.

ఇదీ చదవండి:

రైతులు- కేంద్రం మధ్య నేడు ఆరోదఫా చర్చలు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details